Mahaa Daily Exclusive

  డీలిమిటేషన్‌ బిల్లును ఉమ్మడిగా వ్యతిరేకిస్తాం..! కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.

Share

  • డీలిమిటేషన్‌ బిల్లును ఉమ్మడిగా వ్యతిరేకిస్తాం!
  • 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలి.
  • రాష్ట్రాల సీట్ల వాటాను 25 ఏళ్లపాటు మార్చొద్దు.
  • కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.

న్యూఢిల్లీ, మహా:

నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టిన మహిళా రిజర్వేషన్‌ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఉమ్మడిగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. మహిళా రిజర్వేషన్‌ను ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే అమలు చేయాలని, రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపును మరో 25 ఏళ్లపాటు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

దిల్లీలోని తన నివాసంలో శనివారం ఇండియా కూటమి నేతలతో ఖర్గే సమావేశమయ్యారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ బెనర్జీ, కపిల్‌ సిబల్‌, మనోజ్‌ ఝా తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఖర్గే అన్నారు. ఓటర్ల జాబితాల నుంచి 10 కోట్ల మందికి పైగా పేర్లు తొలగించారని ఆరోపించారు. వివాదాలకు కారణమైన ఎన్నికల సంఘానికి నియోజకవర్గాల పునర్విభజన బాధ్యతలు అప్పగించడం తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ నేతృత్వంలో ఈ ప్రక్రియ జరిగితే అక్రమాలకు అవకాశం ఉంటుందని విమర్శించారు.

అసోం, జమ్మూకశ్మీర్‌లలో జరిగిన పునర్విభజన తరహాలో సాధారణ స్థానాలను రిజర్వుడు స్థానాలుగా, రిజర్వుడు స్థానాలను సాధారణ స్థానాలుగా మార్చే ప్రమాదం ఉందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ‘400 పార్‌’ నినాదం ఇచ్చిన బీజేపీ ఇప్పుడు లోక్‌సభ స్థానాలను 850కి పెంచి ‘800 పార్‌’ లక్ష్యంతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. అధికారాన్ని శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనలు తీసుకొస్తున్నారని ఆరోపించారు.

తాజా జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉందని, అయితే కేంద్రం ప్రతిపాదిస్తున్న విధానం వల్ల ఆ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఖర్గే అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని అమలు చేయాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. సీట్ల సంఖ్యను 850కి పెంచడం దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు.

గతంలోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని, అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ముందుకు సాగలేకపోయిందని ఖర్గే అన్నారు. అప్పటి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందన్నారు.

మహిళా రిజర్వేషన్‌కు తాము వ్యతిరేకం కాదని, దానిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్నే వ్యతిరేకిస్తున్నామని ఖర్గే స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను ప్రస్తుత లోక్‌సభ స్థానాల్లోనే అమలు చేయాలని, రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీని 25 ఏళ్లపాటు మార్చకూడదని డిమాండ్‌ చేశారు. ఈ బిల్లును ఇండియా కూటమి పక్షాలన్నీ పార్లమెంట్‌లో కలిసికట్టుగా వ్యతిరేకిస్తాయని వెల్లడించారు.

Latest