Mahaa Daily Exclusive

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే..:రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌..

Share

  • ఐదు నెలల రాష్ట్రపతి పాలనకు అవకాశం.
  •  డీలిమిటేషన్‌పై డిసెంబరులోగా నిర్ణయం తీసుకోవాలి.
  •  రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌.

హైదరాబాద్‌, మహా:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరిగే అవకాశం ఉందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలతో సమన్వయం చేసే క్రమంలో రాష్ట్రంలో ఐదు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు, ఆ తర్వాత ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలన్నింటికీ 2029లోనే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉంటుందని చెప్పారు. శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన తెలంగాణ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, పార్లమెంటు సమావేశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

జనాభా ప్రాతిపదికనే సీట్ల పెంపు

డీలిమిటేషన్‌ ప్రక్రియపై లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ప్రతి పదేళ్లకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్పారు. డిసెంబరులోగా డీలిమిటేషన్‌ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించకపోతే, ఆ తర్వాత జనాభా ప్రాతిపదికనే సీట్ల పెంపు చేపట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. జీడీపీ ఆధారంగా లోక్‌సభ స్థానాలను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరుతున్నారని, జీడీపీ ఏటా మారుతుంటే ఎంపీ స్థానాలను కూడా ఏటా మార్చడం సాధ్యమా? అని ప్రశ్నించారు. సీట్ల పెంపుపై చర్చించేటప్పుడు దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు ఒక్కో లోక్‌సభ స్థానం మాత్రమే ఉందని గుర్తుచేశారు.

లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగితే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు కూడా పెరుగుతాయని లక్ష్మణ్‌ చెప్పారు. తద్వారా చట్టసభల్లో బలహీన వర్గాలకు మరింత ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అంశంపై అన్ని ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్చ జరగాలని అన్నారు.

మహిళా బిల్లును అడ్డుకున్నవారు ఓడిపోయారు

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందని లక్ష్మణ్‌ తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీలు అడ్డుకున్నాయని విమర్శించారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన నాయకులు వివిధ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని పేర్కొన్నారు.

నవంబరు 30 నుంచి పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు సమావేశాలపై లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. నవంబరు 30న లోక్‌సభ, డిసెంబరు 2న రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయని తెలిపారు. డిసెంబరు 3 వరకు సమావేశాలు కొనసాగనున్నాయని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆగస్టు 13న ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయని, అప్పటి నుంచి సమావేశాలు తిరిగి నిర్వహించేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల అంశాలపై పార్లమెంటులో జరిగే చర్చలు కీలకంగా మారనున్నాయని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Latest