Mahaa Daily Exclusive

  అంగుళం కూడా తగ్గని అహంభావం..

Share

బిఆర్ఎస్ వైఖరి చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉన్నది. తాను లేకపోతే ఈ హైదరాబాద్ ఇలా అభివృద్ధి పథాన దూసుకుపోయేది కాదని కేటీఆర్ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. కనుక బ్లైండ్ గా పోతున్నారు. అధికారం కోల్పోయి ఏడాది గడచినా అహంభావం ఒక్క అంగుళం కూడా తగ్గడం లేదంటే అందుకు కారణం ధనబలం,మితిమీరిన విశ్వాసమే.’ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చవట,సన్నాసి, చదువు రానోడు, మెడ మీద తలకాయ లేనోడు,’…. ఇలా అడ్డదిడ్డంగా కామెంట్లు చేస్తూ తన చౌకబారు తనాన్ని కేటీఆర్ ప్రతి సందర్భంలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింతర్వాత 55 కోట్లను ఫార్ములా ఈ కారు రేసింగ్ సంస్థకు పంపించిన తీరు ఒక ఎత్తు అయితే దాన్ని సమర్ధించుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ ఒక ఎత్తు.’ నేనే కేబినెట్.ఆ డబ్బు విడుదల చేయాలని నేనే ఉన్నతాధికారులకు చెప్పాను’ అని అప్పట్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. అవసరమైతే జైలుకు వెళతానని, జైలులో యోగా,ధ్యానం చేసుకొని ఫిట్ నెస్ పెంచుకొని ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పారు ఏసిబి కేసు నమోదు చేసిన వెంటనే హైకోర్టును ఆశ్రయించి తనపై పెట్టిన కేసు ఎత్తివేయాలంటూ వేడుకున్నారు.రోజుల వ్యవధిలో ఏమిటీ వైరుధ్యం? రోజుల తేడాతో ఏమిటీ మాటల మార్పు. ఆర్బీఐకి తెలియకుండా 55 కోట్లు విదేశాలకు తరలించడం ‘ఫెమా’ ఉల్లంఘన కిందకు వస్తుంది. అంటే ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ ను ఏరికోరి ఆహ్వానించినట్లే!

 

ఇటు ఏసీబీ,అటు ఈడీ కేసులు చుట్టుముట్టడంతో కేటీఆర్ కాలుగాలిన పిల్లిలా మారారు. ఆయనకేమీ పాలుపోవడం లేదు. జైలుకు పోకుండా ఉండాలని బహుశా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశించారేమో అనే అనుమానాలు కలుగుతున్నవి. అది మరలా ఇంటి సమస్య. కేసీఆర్ కుటుంబ సమస్యలే,పార్టీ సమస్యలుగా,పార్టీ సమస్యలే కుటుంబ సమస్యలుగా మారిపోయిన ఒక వాతావరణం 2014 నుంచే కొనసాగుతున్నది.’కుటుంబ’ పార్టీ ముద్ర నుంచి బయటపడలేకపోవడం ఒక కారణమైతే కేటీఆర్ జైలుకు పోవలసి వస్తే హరీశ్ రావు,లేదా కవిత పార్టీని ‘హైజాక్’ చేస్తారన్న భయం కేసీఆర్ కు ఉండవచ్చు. అందువల్ల కొడుకు జైలు ఊచలు లెక్కపెట్టకుండా తండ్రి ప్రయత్నాలు ముమ్మరం చేశారని,’ఢిల్లీ’తో టచ్ లోకి వెళ్లారంటూ తెలంగాణ భవన్ వర్గాల్లో ఒక వార్త భగ్గుమంటున్నది.

 

ఫార్ములా-ఈ కారు రేసులో జరిగిన ఆర్థికతవకలపై కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. గవర్నర్ నుంచి అనుమతి వచ్చాకే ఎసిబి రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై మంత్రిమండలిలో చర్చ జరిగినట్టు ఉప్పందగానే కేటీఆర్ ఇంకా చెలరేగిపోయారు.’నలుగురు సన్నాసులు’ కలిసి కూర్చొని తనపై ఎలాంటి కేసులు పెట్టాలో చర్చించారని రేవంత్ కేబినెట్ ను అవమానించారు. ఫార్ములా కేసులో చాలా కోణాలున్నవి. ఇందులో కనిపించని ప్రధాన కోణం దళిత అధికారుల పట్ల కేసీఆర్ హయాంలో చూపిన వివక్ష,నిర్లక్ష్య ధోరణి. తమ సామాజికవర్గ అధికారులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో వెతికి,వెతికి గాలించి తీసుకువచ్చి ముఖ్యమైన పోస్టింగులు ఇచ్చి,ఆ పోస్టులలో,వాళ్ళు పనిచేస్తున్న చోటే ఏండ్ల తరబడి ఉండేలా ఉత్తర్వులు జారీ చెశారు. అలాగే పదవీ విరమణ చేసినా ఏండ్ల తరబడి ఆయా పోస్టుల్లోనే గడువు పొడిగిస్తూ పోవడం కేసీఆర్ హయాంలో మాత్రమే జరిగిన వింత.

 

ఇదివరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో పాలించిన ముఖ్యమంత్రులు తమ సామాజికవర్గానికి కొంత ప్రాధాన్యం ఇచ్చిన మాట నిజమే గానీ ఇట్లా ఇష్టా ‘రాజ్యం’గా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు.ఇకపై రారు. తెలంగాణ పౌరసమాజం తమను గమనిస్తున్నదని,ఉద్యమ పార్టీని,ఫక్తు రాజకీయ పార్టీగా మార్చిపారేసి,అవకాశవాదులను,’ప్రత్యేక తెలంగాణ’ వ్యతిరేకులను చేరదీసి దానికి ‘తెలంగాణ పునరేకీకరణ’ అని నామకరణం చేసి పరిపాలించిన వ్యక్తి కేసీఆర్. ఆయన తానా అంటే తందానా అంటూ కొడుకూ,మేనల్లుడూ,ఇతర మంత్రులు,నాయకులు ఇలాంటి వైఖరి సరైంది కాదని,ఒక సామాజికవర్గానికి మాత్రమే పెద్దపీట వేసి,ప్రాధాన్యం ఇచ్చి దళితులు,బహుజన వర్గాల ఉద్యోగులు,అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించడం మంచిది కాదని చెప్పేదెవరు?వినేదెవరు?

 

కేసీఆర్ హయాంలో దళిత ఆఫీసర్లకు అడుగడుగునా అవమానం జరిగినట్టు,ఐఏఎస్, ఐపీఎస్లకు కీలక పోస్టులు ఇవ్వకుండా చిన్నచూపు చూసినట్టు,అప్రాధాన్య పోస్టుల్లోకి పంపుతూ చులకన చేసినట్టు,ఇతర వర్గాల వారికి ఎక్స్టెన్షన్లు,పెద్ద పోస్టులు ఇవ్వడం ఉత్తరాది వాళ్లకే ప్రాధాన్యం ఉన్న పదవులు కట్టబెట్టిన ఉదంతాలన్నీ అదృష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి రావడం వలన,రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందున వెలుగులోకి వస్తున్నవి.అలా కాకుండా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి ఉంటే బిఆర్ఎస్ నాయకులకు పట్టపగ్గాలు ఉండేవి కాదు.

 

తెలంగాణ ఏర్పడినపుడు ఇద్దరు దళితులు ఉప ముఖ్యమంత్రులు,చీఫ్ సెక్రటరీగా దళిత ఐఏఎస్ అధికారి ఉండేవారు. కీలక పదవుల్లోనూ దళిత వర్గానికి చెందిన ఐఏఎస్,ఐపీఎస్ ఆఫీసర్లు సేవలందించారు. దళితుడినే తొలి సీఎం చేస్తానని ప్రజలకు చెప్పి,తానే ఆ సీటులో కుర్చున్న కేసీఆర్ దళితుల్లో వ్యతిరేకతను తొలగించుకునేందుకు ఆ వర్గానికి చెందిన నాయకులు,ఆఫీసర్లకు ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపించారు.నెమ్మదిగా తన విశ్వరూపం ప్రదర్శించారు ప్రభుత్వ పెద్దల అసలు రంగు బయటపడడానికి కొంత సమయం పట్టింది. రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేశారు.తర్వాత కడియం శ్రీహరికి ఆ పదవి ఇచ్చినా ‘రెండో టర్మ్’లో ఏకంగా ఆ పోస్టునే లేకుండా చేశారు. రెండో టర్మ్ లో కేసీఆర్,కేటీఆర్ ‘విజృంభణ’ సాగింది. క్రమంగా దళిత ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు అవమానాలు మొదలయ్యాయి. కీలక పోస్టుల్లో ఉన్న వాళ్ళను ‘లూప్లైన్’లోకి నెట్టివేయడం ప్రారంభమైంది. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ప్రదీప్ చంద్రకు ఎక్స్ టెన్షన్ ఇవ్వకుండా అగౌరవంగా వీడ్కోలు పలికారు. దళిత వర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు వీఆర్ఎస్ తీసుకోవటం కలకలం రేపింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విద్యాకమిషన్ చైర్మన్ గా అణిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి,ఐపీఎస్ అధికారి,ప్రస్తుతం బిఆర్ఎస్ లో పనిచేస్తున్నఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవటం వెనుక దళిత ఆఫీసర్లను చులకనగా చూసిన తీరే కారణమన్న విమర్శలు ఉన్నవి.

 

తెలంగాణకు రెండో సీఎస్ గా నియమితులైన ప్రదీప్ చంద్ర కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఫైనాన్స్,రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పని చేసిన ప్రదీప్ చంద్ర 2 నెలలే చీఫ్ సెక్రెటరీగా ఉన్నారు. ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారు. ఉత్తరాదికి చెందిన తొలి సీఎస్ రాజీవ్ శర్మకు రెండుసార్లు పదవీకాలం పొడిగించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కూడా ఆయనను నియమించుకున్నారు. ఆయనకు ఘనంగా సెక్రెటేరియట్ వీడ్కోలు పలికారు. అదే సమయంలో సీసీఎల్ఏ కమిషనర్గా ఉన్న రేమండ్ పీటర్ కు ఇలాంటి అన్యాయమే జరిగింది. తనను సలహాదారుగా నియమిస్తామని హామీ ఇచ్చారని పీటర్ పదవీకాలం చివరి రోజు వరకు ఎదురుచూసి భంగపడ్డారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు సమయంలో కీలక పాత్ర పోషించిన వీరిద్దరిని అమర్యాదకరంగా పంపించడం వెనుక దళితుల పట్ల ‘వివక్ష’ నిదర్శనమని విశ్లేషణలున్నవి.

 

తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీ రాష్ట్రంలో ఉత్తరాది రాష్ట్రాల అధికారుల పెత్తనమే కొనసాగింది.తెలంగాణకు చెందిన దళిత,గిరిజన, మైనార్టీ,బీసీ ఐఏఎస్‌‌‌‌లంతా ఉత్తరాది పెత్తనంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటి చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోషిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్రాధాన్య పోస్టుల్లో తమను నియమించి,ఓసీలకు,ఉత్తరాది ఐఏఎస్ ఆఫీసర్లకు కీలక పోస్టులు ఇస్తున్నారని ఆవేదన చెందారు. 21 మంది ఐఏఎస్ అధికారులను ‘దిక్కుమాలిన’ పోస్టులలో నియమించారని ఫిర్యాదు చేయటం అప్పట్లో ఒక సంచలనం. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పని చేసిన దళిత ఐఏఎస్ అధికారి దానకిశోర్ ను ప్రభుత్వం కొద్ది నెలలకే అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది. ఎన్నికల సమయంలో ‘గ్రేటర్ హైదరాబాద్’ నగరంలో హోర్డింగ్లు,ఫ్లెక్సీల విషయంలో కటువుగా ఉన్నందుకే ఆయనపై అధికార పార్టీ బిఆర్ఎస్ కక్ష కట్టిందన్న ప్రచారం జరిగింది. గతంలో పాఠశాల విద్యా కమిషనర్ గా పని చేసిన విజయ్ కుమార్ ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది.ఆరు నెలల పాటు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.

 

గురుకులాల కార్యదర్శిగా పని చేసిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ను కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో ప్రశంసించారు.అయితే అదంతా కేవలం ప్రజలు,మీడియా కోసమేనని ఆ తర్వాతే ప్రవీణ్ కుమార్ కు తెలిసి వచ్చింది. కొత్త గురుకులాల ఏర్పాటు నుంచి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాలను ప్రవీణ్ చేపట్టారు. గురుకులాల్లో ప్రతి నెల జరిగే మీటింగ్లకు స్థానిక ఎమ్మెల్యే,జడ్పీ చైర్పర్సన్,ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ను ఆహ్వానించాలని కేసీఆర్ కేబినెట్ నిర్ణయించడం ఇందుకు పునాది. అడ్మిషన్లు,గురుకులాల నిర్వహణలో రాజకీయ ఒత్తిళ్లు,రాజకీయనాయకుల జోక్యంతోనే సమర్ధుడైన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ విఆర్ఎస్ తీసుకొని బహుజనసమాజ్ పార్టీలో చేరారు.ఆ తర్వాత ఆయన కేసీఆర్ పార్టీలోనే చేరడం ఒక విశేషం.

 

ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసిన అసంతృప్తితో ఉద్యోగం వదిలిపెట్టారు.దళిత ఐఏఎస్ లకు అన్యాయం జరుగుతోందని మురళి అప్పట్లో ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ‘ఈజేఎస్’ డైరెక్టర్ గా ఉన్న మురళి,తర్వాత భూపాలపల్లి కలెక్టర్ గా పని చేశారు. నిరుపేదల పక్షపాతిగా పేరున్న మురళి సమర్థుడైన అధికారిగానూ పేరు సంపాదించారు. ఆయనను ఏకంగా పురావస్తు శాఖకు బదిలీ చేయడం కక్ష సాధింపులో భాగమని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.తెలంగాణలో వీఆర్ఎస్ తీసుకున్న మురళిని జగన్ ప్రభుత్వం పిలిచి విద్యారంగానికి సంబంధించిన సలహాదారుగా నియమించుకుంది.”ఆకునూరి మురళి ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు.ప్రతిభ ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు ఇవ్వడం గత ముఖ్యమంత్రులుచేసే వారు. సీఎం కేసీఆర్‌‌ పాలనలో ఉన్నంత వివక్ష,దరిద్రమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు. తెలంగాణలో అగ్రవర్ణాలను అందలం ఎక్కిస్తున్నరు. రిటైర్ అయిన 10 నుంచి 12 ఏండ్లు నాన్‌‌ ఐఏఎస్‌‌ ఆఫీసర్లకు మాత్రం ఐఏఎస్‌‌ కేడర్‌‌ పోస్టులు,కీలక పదవులు అప్పజెప్పారు.బడుగు వర్గాల ఐఏఎస్‌‌లకు మాత్రం అప్రాధాన్య పోస్టులు ఇస్తున్నారు. సర్వీస్ ఏండ్లు గడుస్తున్నా చాలా మంది కలెక్టర్‌‌గా పనిచేయలేదు.ఇది ముమ్మాటికీ ఎస్సీ, ఎస్టీలపై వివక్షే.ఇంత వివక్ష ఎప్పుడు చూడలేదు” అని మురళి ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.

 

దళిత సాధికారత,దళిత బంధు కేవలం పేరుకు మాత్రమే.వారికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతూనే కేసీఆర్ తన కార్యాలయంలో ఒక్క దళిత అధికారినీ చేర్చుకోలేదు. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఉన్న వాళ్లే సీఎంవోలో కీలకంగా ఉన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఆఫీసులోని ఐదుగురు ఆఫీసర్లలో ప్రిన్సిపల్ సెక్రటరీ సహా ఇద్దరు సెక్రటరీలు రిటైర్ అయిన వారే కొనసాగారు. . మిగతా ఇద్దరు మాత్రమే సర్వీస్లో ఉన్నవారు. ”సీఎంవోలో దళితులున్నారా”‘?అని ప్రస్తుత లోక్ సభ సభ్యుడు ఈటల రాజేందర్ ప్రశ్నించటం రాజకీయంగా అప్పట్లో దుమారం లేపింది.

 

ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలో జరిగిన వివక్షను దృష్టిలో పెట్టుకొని తన కార్యాలయంలో,ఇతర ప్రాధాన్య పోస్టులలో ఎస్.సి,ఎస్.టి,బిసి,మైనారిటీలు,బహుజన అధికారులను నియమిస్తున్నట్టు కనబడుతున్నది.’రెడ్డి పరివార్’ అనే నింద రాకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ శ్రేయోభిలాషులు కోరుతున్నారు.

 

 

 

ఎస్.కే.జకీర్,

సీనియర్ జర్నలిస్ట్.

Latest