అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆదివారం హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటిస్తుండగా గ్రామానికి చెందిన మత్స్యకారులు బల్క్ డ్రగ్స్ కంపెనీ ఏర్పాటు చేయవద్దని ఫ్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు.
మంత్రి అనితతో మత్స్యకారులు మాట్లాడుతూ కాకినాడ ప్రాంతంలో వ్యతిరేకించిన బల్క్ డ్రగ్ కంపెనీని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దని, ఇక్కడ ఏర్పాటు చేస్తే సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న తామంతా రోడ్డును పడతామని, తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఆమోదమైన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై హోంమంత్రి అనిత స్పందిస్తూ ఇక్కడ ఏ పరిశ్రమలు రాబోతున్నాయో ఇంకా స్పష్టత లేదన్నారు. ఎపిఐఐసి సేకరించిన భూములలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా అధికారులు సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు.
ఇందులో భాగంగానే అధికారులు ఆ పనులు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేసే ముందు గ్రామసభలు, ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని స్పష్టం చేశారు. భూసేకరణకు సంబంధించి పరిహారం, ప్యాకేజీ సమస్యను జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతానన్నారు.








