హైదరాబాద్ బుక్ ఫెయిర్ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ నెల 19 నుంచి 29 వరకు నిర్వహించిన 37వ పుస్తక ప్రదర్శనకు భారీ స్పందన వచ్చింది. లక్షల సంఖ్యలో పుస్తక ప్రియుల ఈ బుక్ ఫెయిర్ ను సందర్శించారు. దీంతో బుక్ ఫెయిర్ నిర్వాహకులు, బుక్ స్టాళ్ల నిర్వహకులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కంటే ఈసారి ఊహించని విధంగా భారీ సంఖ్యలో సందర్శకులు విజిట్ చేశారని తెలిపారు. అయితే, ఈసారి యువతరం పుస్తక ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలతోపాటు చరిత్ర, గ్రంథాలు, కథలు, జీవిత చరిత్ర, స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను విరివిగా కొనుగోలు చేశారు. వీటితోపాటు రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఎక్కువగా సేల్ అయ్యాయని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి తరలివచ్చారు. ఇటు విద్యార్థులు కూడా భారీగానే బుక్ ఫెయిర్ ను సందర్శించారు. వారికి అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేశారు. కాగా, గతంలో కంటే ఈసారి ఎక్కువగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ రుచులతో కూడిన స్టాళ్లను సైతం బుక్ ఫెయిర్ లో ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా పలు ప్రత్యేకమైన స్టాళ్లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున లభించింది. బుక్ ఫెయిర్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంతో వెనుదిరిగారు. అదేవిధంగా ఈ పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు సైతం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈసారి పదుల సంఖ్యలో కొత్త పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. దీంతో వర్ధమాన కవులు, రచయితలు సంతోషం వ్యక్తం చేశారు. గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, బండారు దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతోపాటు చాలామంది ప్రముఖులు ఈ బుక్ ఫెయిర్ ను సందర్శించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. సోషల్ మీడియా విజృంభిస్తున్న ఈరోజుల్లో బుక్ ఫెయిర్ ను నిర్వహించడం సంతోషకరమని, ఇటువంటి కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. యువత పుస్తకాల వైపు మళ్లాలని, పుస్తక పఠనంతో ఎంతో ఉపయోగమని సూచించారు. బుక్ ఫెయిర్ కొనసాగినన్నీ రోజులు ఎన్టీఆర్ స్టేడియం సందర్శకులతో కిటకిటలాడింది. పరిసరాల్లో కూడా ఏ ఒక్కరిని చూసినా పుస్తకాలతో దర్శనమిచ్చారు.








