Mahaa Daily Exclusive

  పవన్ నామ సంవత్సరం….!

Share

ఈ ఏడాది ఖచ్చితంగా పవర్ నామ సంవత్సరం. జనసైనికులకు పవన్ నామ సంవత్సరం. గత దశాబ్దంన్నర పోరాటానికి, ఆరాటానికి, ప్రజలపై ఉన్న ప్రేమకు, సమాజాన్ని మార్చాలన్న తపనకు, రాజకీయ తారగా వెలిగిపోవాలనుకున్న లక్ష్యానికి.. అన్నింటికీ ఒకే ఒక్క దెబ్బతో పవన్ కల్యాణ్ సమాధానం చెప్పిన ఏడాది 2024. లక్కీ ఇయర్ కాదు.. లక్ష్యాన్నిసాధించిన ఇయర్ గా 2024 అనేక తీపిగురుతులను అందించింది. పవన్ కల్యాణ్ అంటే ఒక్క ఆంధ్రా రాజకీయాలే కాదు.. భారతదేశ రాజకీయాలు కూడా మాట్లాడుకునేలా విశ్వసనీయత, నిబద్దత, నిజాయితీని సముపార్జించిన ఏడాది 2024. ప్రత్యర్ధులకు పవన్ పంజా చూపిన ఏడాది. ప్రజలు గుండెలు చీల్చుకుని పవన్ ను ప్రతిష్టించుకున్న ఏడాది 2024.

వంద శాతం స్ట్రైక్ రేట్

ఈ ఏడాది రాజకీయరంగంలో జనసేనకు అద్భుతంగా కలిసొచ్చింది. ఎంతలా విజయాలు లభించాయంటే.. ఇక ఇంతకుమించి ఎవరు సాధిస్తారబ్బా అనేరీతిలో వందశాతం స్ట్రైక్ రేట్ తో దుమ్మురేపారు. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన రికార్డు సృష్టిస్తే.. అంతకు ముందు ఎన్నికల్లో దక్కించుకున్న సీట్లలో పదో వంతు కూడా దక్కించుకోలేక వైసీపీ పూర్తిగా చతికిల పడింది . పోటీచేసిన అన్ని శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొంది దేశం దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి నేషనల్ ఇమేజ్ సొంతం చేసుకున్న జనసేనాని ప్రధాని మోడీ ప్రశంసలు అందుకుంటూ పొలిటికల్ స్క్రీన్‌పై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రత్యర్ధుల ప్రశంసలు పొందే రాజకీయాలు చేస్తూ.. ఇదీ పవన్ అంటే అనిపిస్తున్నారు.

కలిసొచ్చిన కాలం

జనసేనాని పవన్ కల్యాణ్ యువరాజ్యాధినేతగా తెలుగురాష్ట్రాల ప్రజల మనసులు చదివారు. రాష్ట్ర విభజన అనంతరం తానే జనసేన స్థాపించి వ్యూహాత్మక రాజకీయాలకు కేరాఫ్ గా మారారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనకు, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు బాగా కలిసొచ్చిన సంవత్సరం 2024ని . 2014లో పార్టీని పెట్టినప్పటికీ ఆ ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రచారం చేసిన పవన్‌కళ్యాణ్ పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జనసేన కేవలం ఒక సీటును మాత్రమే గెల్చుకుంది. జనసేనాని అయితే పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండుచోట్ల ఓడిపోయారు. అదే జనసేన 2024లో పోటీచేసిన 21 శాసనసభ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. ఏవిధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలో సరిగ్గా అంచనా వేయగలిగారు. అప్పటి అధికారపక్షం వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా వెనక్కి తగ్గలేదు.. ప్రతి విమర్శకు ధీటైన జవాబు ఇస్తూ ముందుకుసాగారు.

వారాహితో మమేకమై..

వారాహి యాత్రతో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్న మాటపై చివరివరకు నిలబడుతూ.. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరడంతో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. జనసేనకు తక్కువ సీట్ల కేటాయింపుపై ఎన్నో రకాల విమర్శలు వచ్చినా.. తాను పోటీచేసే అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటడమే తన ముందున్న కర్తవ్యమంటూ ముందుకెళ్లారు. చివరకు పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. వైసీపీని అద:పాతాళానికి తొక్కేస్తానని ఎన్నికల ప్రచారంలో శపధం చేసిన జనసేనాని దాన్ని చేసి చూపించారు

శక్తిగా మారిన జనసేన

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు వరకు జనసేన ఓ రాజకీయపార్టీ.. ఎన్నికల తర్వాత ఆపార్టీ ఓ శక్తిగా మారింది. పవర్ ఉంటే ఏదైనా చేయ్యెచ్చు.. జనసేన లక్ష్యం చేరుకోవాలంటే పవర్ కావాలంటూ పవన్ కళ్యాణ్ పదేపదే వ్యాఖ్యానించేవారు. సరిగ్గా 2024 ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా మారింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా తాను ప్రజాసేవకుడినేనంటూ ముందుకు సాగారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడా తొందరపాటు చూపించకుండా.. నిదానంగా ముందుకెళ్తూ.. అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తున్నారు. తనకు ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తూ.. రాష్ట్రంలో తనదైన మార్క్‌ పాలనను ప్రజలకు చూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఏదైనా రాజకీయపార్టీ మత విశ్వాసాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తమది సెక్యులర్ పార్టీ అని అన్ని మతాలను సమానంగా చూస్తామని ప్రచారం చేసుకుంటారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించుకోవల్సిన అవసరం ఉందని, తమ పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషిచేస్తుందని బహిరంగంగా ప్రకటించడంతో పాటు తిరుపతిలో ఓ సభ ఏర్పాటుచేసి డిక్లరేషన్ ప్రకటించారు.

సనాతన ధర్మ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్‌

ఏపీలో సనాతన ధర్మ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు. ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన అవసరాన్ని ధైర్యంగా చెప్పారు. దేశ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైతే తాను నాయకత్వం వహిస్తాననే రీతిలో పవన్ కళ్యాణ్ తీరు కనిపిస్తోంది. దీంతో యావత్తు దేశ ప్రజల దృష్టిని పవన్ కళ్యాణ్ తనవైపు తిప్పుకున్నారు.

మహారాష్ట్ర ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇండియా, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడంతో శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. రెండు కూటములు అధికారంపై ధీమా వ్యక్తం చేశాయి. చివరకు ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా గతంలో తెలుగు ఓటర్లు ఎక్కువుగా ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లేదా ఆ పార్టీ మద్దతు దారులు ఎక్కువుగా గెలుపొందేవారు.

ఈసారి పవన్ కళ్యాణ్ తెలుగు ఓటర్లు ఎక్కువ ప్రభావం చూపించే నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి మంచి ప్రదర్శన కనబర్చింది. దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయస్థాయికి వెళ్లింది. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అంటూ జనసైనికులు నినాదాలు హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఎన్డీయే సమావేశాల్లో పవన్ కళ్యాణ్‌ను ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తడం ఆయన ఇమేజ్‌ను దేశ స్థాయిలో మరింత పెంచింది.

జనసేనాని ఎక్కడకు వెళ్లినా సీఎం సీఎం అంటూ జనసైనికులు హోరెత్తిస్తున్నారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు అలా నినాదాలు చేస్తున్న అభిమానులను ఆయన వారించారు. అలా చేయవద్దని తానే ఇలా చేయిస్తున్నానని అనుకుని అవకాశం ఉందని, ఏపీకి ఎంతో అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని… ఆయనను మనమందరం గౌరవించాలంటూ తన రాజకీయ పరిణతి ప్రదర్శించారు. అంతకు ముందు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా కూటమే గెలుస్తుందని, చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని ఆయన వ్యాఖ్యానించి చంద్రబాబు అనుభవం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకోవడం విశేషం.

మొత్తమ్మీద 2024 సంవత్సరం పవన్‌‌కళ్యాణ్‌కు గోల్డెన్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2023 వరకు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలాంటి విజయాలను చూడలేదు. కానీ 2024లో అన్నింటి లెక్కలు ఒక్కసారే తేల్చేశాడు. చరిత్ర ఎరుగని విజయాలు అందుకున్నారు. పాలనలో పరిణతి ప్రదర్శిస్తూ ప్రజలకు తనలోని కొత్త కోణం ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. అందుకే 2024ని పవన్ నామ సంవత్సరమంటూ.. జనసైనికులే కాదు రాజకీయ అభిమానులు కూడా సంబురాల్లో మునిగిపోయారు. 2024 జనసేన కాలం. జనసేన ద్వారా ముగ్గురికి మంత్రి యోగం దక్కింది. 2025లో నాగబాబు కూడా మంత్రి కానున్నారు. జనసేనాని అన్నయ్యకిచ్చే అపురూప బహుమతి ఇదే. ప్రజలంటే ప్రేమ పెంచుకున్న జనసేనాని జైత్రయాత్రకు వేదికగా 2024 నిలిచింది.

Latest