యాదగిరిగుట్టపై ఓ బాలుడికి ప్రమాదం తప్పింది, దర్శనార్థం క్యూ లైన్ కోసం ఏర్పాటు చేసిన గ్రీల్స్ మధ్య ఇరుక్కున్న బాలుడి తలను భక్తులు చాకచక్యంగా బయటికి తీశారు. బాలుడి చేసిన పనికి తల్లిదండ్రులే కాదు క్యూలైన్‌లో నిలబడి దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులు సైతం భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ బోడుప్పల్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం నిన్న రాత్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి వారి శీఘ్ర దర్శనం కోసం పయనమయ్యారు. ఆదివారం కావడంతో స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం ప్రత్యేక క్యూ లైన్ లో వేచి ఉన్న సమయంలో బాలుడు పక్కనే వున్న రెండు గ్రిల్స్ మధ్య తల పెట్టాడు. అంతే ఎంతకూ తల బయటకు రాకపోవడంతో బాలుడు కేకలు వేశాడు. గుర్తించిన తల్లి దండ్రులు బాలుడి తలను గ్రిల్స్ నుంచి బయటకు తీయడానికి నానా తంటాలు పడ్డారు. అయితే అక్కడే వున్న కొందరు అయ్యప్ప మాల ధరించిన స్వాములు బాలుడి తలను చాకచక్యంగా బయటకు తీశారు. బాలుడికి గాయాలు ఏమీ కాకపోవడంతో తల్లిదం డ్రులు, దర్శనానికి వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకు న్నారు. చిన్న పిల్లలతో వచ్చిన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని ఆలయ అధికారులు సూచించారు.








