సంక్రాంతిలోపు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించాల్సిందే
తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
లేకపోతే బీజేపీ మహోద్యమం తప్పదు
మన్మోహన్ ను రబ్బర్ స్టాంప్ గా మార్చింది కాంగ్రెస్
మన్మోహన్ ఆర్డినెన్స్ ను చింపేసి రాహుల్ గాంధీ అవమానించారు
పీవీని అడుగడుగున అవమానించిన మీకు మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత లేదు
ట్రిపుల్ ఆర్ టెండర్లు ఆహ్వానించిన మోదీ ప్రభుత్వానికి తెలంగాణ పక్షాన ధన్యవాదాలు
కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మహా : సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్ మెంట్ మొత్తాన్ని చెల్లించాలని, లేకపోతే బీజేపీ మహోధ్యమం చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇఛ్చిన మాటకు కట్టుబడి వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో సంజయ్ దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్ లో చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను సన్మానించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్థోమత లేని నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం వల్లే ఈరోజు ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. అయినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, బిశ్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి 4 ఏళ్లయినా వాటిని భర్తీ చేయలేదన్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని మండిపడ్డారు. 25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గప్పాలు కొడుతోందని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2022 అక్టోబర్ లో ప్రకటించిందని, ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, అభ్యర్థులకు అపాయిట్ మెంట్ లెటర్లు కూడా ఇచ్చిందన్నారు. కానీ యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు ఇచ్చిన హమీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని సంజయ్ మండిపడ్డారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని మాట తప్పిందని, ఒక్కో నిరుద్యోగికి రూ.48 వేలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడిందని, వెంటనే ఆ బకాయి ఇవ్వాలని, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేనిపక్షంలో బీజేపీ పక్షాన తీవ్రమైన ఆందోళనలు చేసేందుకు సిద్దమవుతుందని హెచ్చరించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ అందక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడుతున్నారని, కాలేజీల యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు మూసుకునే దుస్థితి. విద్యార్థులపై ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని, అందుకే ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నామన్నారు. సంక్రాంతిలోపు బకాయిపడ్డ ఫీజు రీయంబర్స్ మెంట్ సొమ్మును చెల్లించాల్సిందే. లేనిపక్షంలో కిషన్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వ మెడలు వంచి తీరుతామన్నారు.
ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చిన సంక్రాంతి కానుక ఇది అని అన్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి దాదాపు రూ.18 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వలేశారని, ఆ మొత్తాన్ని కేంద్రం భరించేందుకు సిద్దమైందన్నారు.
అంత్యక్రియలను రాజకీయం చేయడం తప్పు
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్లు సూపర్ ప్రధానిగా సోనియాగాంధీ కొనసాగుతూ రబ్బర్ స్టాంప్ గా మార్చారని విరుచుకుపడ్డారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రజాప్రతినిధ్యం చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ కాపీలను రాహుల్ గాంధీ చింపివేసి మన్మోహన్ ను దారుణంగా అవమానించారన్నారు. కానీ మన్మోహన్ సింగ్ సేవలను గుర్తించి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు ఢిల్లీలోనే స్మారక స్థల్ నిర్మించేందుకు సిద్దమైందని, కానీ మాజీ ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహరావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్. వారికి మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేనేలేదన్నారు.








