హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ( నుమాయిష్) వాయిదా పడింది. మాజీ ప్రధాని సంతాప దినాల నేపథ్యంలో నుమాయిష్ ను రెండు రోజులపాటు వాయిదా పడింది. జనవరి 3వ తేదీన నుమాయిష్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది నుమాయిష్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జనవరి 1న ఈ నుమాయిష్ ప్రారంభమై 46 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 15 వరకు జరగాల్సి ఉంది.
పారిశ్రామిక ప్రదర్శన కోసం దాదాపు 2500 స్టాళ్ల నిర్మాణం చేసేందుకు నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 1938లో నిజాం కాలంలో మొదలైన నుమాయిష్ కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు అమ్యూజ్‌మెంట్ పార్క్ ఇలా అనేక స్టాళ్లను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేస్తారు.








