మహా: కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆలయ ప్రధాన అర్చకులు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు, వధువులు మేడలాదేవి, కేతమ్మదేవీ తరపున మహాదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణాన్ని జరిపించారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు కొమురవెల్లి క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద గల కల్యాణ వేదికలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ముక్కోటి దేవదూతలు, పంచభూతాలు, వీరశైవ అర్చకుల వేదమంత్రాలు, భక్తకోటీ జయజయద్వానాల మధ్య గోళ్లకేతమ్మ, బలిజమేడలమ్మలను కొమురవెల్లి మల్లన్న వివాహమాడారు. కన్నుల పండువగా జరిగిన ఈ కల్యాణ మహోత్సవంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డితోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో కొమురవెల్లి కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మల్లన్న స్వామి నామస్మరణతో మారుమోగాయి.
3 నెలల పాటు బ్రహ్మోత్సవాలు
ఉదయం 5 గంటలకు స్వామివారికి దిష్టికుంభం(బలిహరణం), మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రథోత్సవం కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా నేడు కూడా ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మల్లన్న కళ్యాణంతో జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు నెలల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
ప్రతి సంవత్సరం ఆనవాయితీ..
స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని సంక్రాంతి పండుగకు ముందు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ప్రతీ సంవత్సరం ప్రభుత్వం తరఫున పట్టువస్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఈసారి కూడా సమర్పించారు.
పచ్చదనం ఉట్టిపడేలా..
మల్లన్న కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, షామియానాలు, పచ్చదనం ఉట్టిపడేవిధంగా పలు ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నూతన క్యూలైన్ల నిర్మాణం చేపట్టడడంతో రాజగోపురం వద్ద చలువ పందిళ్లతో తాత్కాలిక క్యూలైన్లు ఏర్పా ట్లు చేశారు. ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్ద తాగునీటి వసతిని సైతం ఏర్పాటు చేశారు. రెగ్యులర్ ఉద్యోగులు, ఔటసోర్సింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇతర ప్రాంతాల నుంచి కొమురవెల్లికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు.
ఒగ్గుకథ, జానపద కళారూపాలు
స్వామివారి జాతర నేపథ్యంలో ఆలయాన్ని దేదీప్యమానంగా ముస్తాబు చేశారు. సాయంత్రం సమయంలో సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒగ్గుకథ, జానపద కళారూపాలు ప్రత్యేకంగా ఆకర్శణగా నిలిచాయి. ఒగ్గుకథలతో కళాకారులు భక్తులను ఎంతగానో అలరించారు.
భారీ భద్రత…
మల్లన్న స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 300 మందికి పైగా సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.








