Mahaa Daily Exclusive

  బీజేపీ దళిత కార్యకర్త నందురాజ్ నివాసానికి బండి సంజయ్….!

Share

అధికారంలో ఉన్నామన్న అహంకారంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు, కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై జరిపిన దాడిలో గాయపడ్డ దళిత మోర్చ కార్యకర్త నందుకుమార్ ను ఆయన నివాసంలో పరామర్శించారు. పాతబస్తీలో బహదూర్ పురాలోని నందు ఇంటికి వెళ్లిన బండి సంజయ్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తలకు గాయం కావడంతో చికిత్స తీసుకున్నట్లు నందు వివరించారు. ఈ సందర్భంగా దాడి ఘటన పూర్వాపరాలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. నందురాజ్ త్వరగా కోలువాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఇనుప రాడ్లు, రాళ్లు, గుడ్లు, కర్రలతో బిజెపి కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గు చేటన్నారు. నిన్న జరిగిన ఘటనను చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లు కన్పిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై బీజేపీ ఎప్పటి కప్పుడు నిలదీస్తుంటే ఓర్వలేక ఈ దాడులు చేయించినట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి కానీ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగమే ఇటువంటి దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలున్న పార్టీ బీజేపీ అనీ కాంగ్రెస్ మూకల దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. మా కార్యకర్తల సహనాన్ని చేతగాని తనంగా భావించొద్దన్నారు. మా కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్ పునాదులుండవని మరోసారి హెచ్చరించారు. అసలు కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరని గుర్తుంచుకుంటే మంచిదని, కాంగ్రెస్ నేతల దాడులకు, బెదిరింపులకు బీజేపీ లొంగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని, ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.

Latest