అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) నూతన కార్యాలయం బుధవారం ప్రారంభమైంది. ఉదయం పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నూతన భవనంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ భవానానికి ఇందిరాభవన్‌గా నామాకరణం చేశారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి 400 మందికి ఆహ్వానాలు వెళ్లాయి. ఆరు అంతస్తులో ఆధునిక సౌకర్యాలతో ఏఐసీసీ కొత్త కార్యాలయాన్ని నిర్మించారు. రాజసం ఉట్టిపడేలా భవనాన్ని తీర్చిదిద్దారు 15 సంవత్సరాలుగా నిర్మాణం… కాగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యక్రమాలు ఉండకూడదని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వివిధ పార్టీలు తమ సొంత భవనాలను నిర్మించుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా నూతన కార్యాలయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు 9 ఏ కోట్లా రోడ్డులో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆరు అంతస్తులతో ఇందిరాభవన్‌ను నిర్మించారు. 2009లో కొత్త భవనం నిర్మాణాన్ని చేపట్టగా.. దాదాపు 15 ఏళ్ల పాటు ఈ నిర్మాణం జరిగింది. ఈరోజు సోనియా గాంధీ చేతుల మీదుగా ఏఐసీసీ కొత్త భవనం ప్రారంభమైంది. అయితే దాదాపు ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డు 24 నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే నూతన భవనంలో ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినప్పటికీ పాత బిల్డింగ్‌లో కూడా కార్యకలాపాలు కొనసాగుతాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.








