భూమి లేని ఉపాధి కూలీలకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధీ కూలీలకు రెండు దఫాల్లో ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవబోతుంది. యావత్ దేశం ఈ స్కీం పట్ల ఆసక్తి చూపుతుండగా..తెలంగాణలోని కొన్ని రాజకీయ శక్తులు ఈ పథకంపై తప్పుడు గణంకాలతో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూలీలకు ఏకాన ఇవ్వని నేతలు ఇప్పుడు వారిపై కపట ప్రేమ నటిస్తున్నారు. రూ. 500 కోట్ల ఆస్తులున్న వారికి సైతం రైతు బంధు ఇచ్చి..రెక్కల కష్టం తప్ప ఏలాంటి ఆస్తి పాస్తులు లేని కూలీలను పట్టించుకోలేదు. ఇప్పుడు కూలీలకు ఆర్దిక చేయుతనందిస్తుంటే చూసి ఓర్వలేక అక్కసు వెల్లగక్కుతున్నారు. భూమిలేని ఉపాధి హమీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అని మేనిఫెస్టో లో కాంగ్రెస్ స్పష్టంగా హమీ ఇచ్చింది. ఇచ్చిన హమీకి కట్టుబడి ఏలాంటి భూమిలేని ఉపాధి హమీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. “ఆసరా పెన్షన్ల”తో సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కుటుంబం యునిట్ గా అమలవుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సైతం అదే నిబంధన వర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న MGNREGA పోర్టల్ అధికారిక లెక్కల ప్రకారమే.. 2023-24 ఆర్దిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 48,13,966 జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలున్నాయి. ఇందులో 22.64 లక్షల కుటుంబాలు కనీసం ఒక్క రోజు కూడా ఉపాధి పనుల్లో పాల్గోనలేదు. కేవలం జాబ్ కార్డు కలిగి ఉన్నంత మాత్రాన ఉపాధి కూలీగా పరిగణించలేము. కూలీ ద్వారా జీవనోపాధి పొందితేనే ఉపాధి కూలీగా పరిగణించబడతారుతెలంగాణలో పేరుకు 48,13,966 జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నప్పటికీ..అందులో కనీసం ఒక రోజు ఉపాధీ హమీ పనుల్లో పాలు పంచుకున్న కుటుంబాలు 25.50 లక్షల వరకు ఉన్నాయి. కనిష్టంగా 20 రోజుల పాటు ఉపాధి కూలీగా పని చేసిన కుటుంబాలనే.. ఉపాధి హమీ ఆధారిత కుటుంబాలుగా పరిగణించడంతో….సుమారు 17.26 లక్షల వరకు కుటుంబాలే 20 రోజుల పనిని పూర్తి చేసుకున్నాయి. అయితే ఇందులో 11 లక్షల కు పైగా కుటుంబాలకు సొంత భూమి ఉండటంతో రైతు భరోసా లబ్దిదారులుగా ఉన్నారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం… ఎలాంటి భూమి లేని 6 లక్షలకు పైగా ఉపాధి కూలీ కుటుంబాలుంటాయన్న అంచనాతో…ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వీరితో పాటు అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని విస్తరిస్తాం.
అయితే గత పాలనలో మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలతో, రాజకీయ పక్షపాతంతో వ్యవహరించకుండా..గ్రామ సభల్లోనే, ప్రజల సమక్షంలోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారులు గుర్తించబడుతారు. గ్రామ సభల నిర్ణయాలకు గౌరవం ఇస్తూ…ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు అర్హత ఉన్న అన్ని ఉపాధి కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల ఆర్దిక చేయుత నిచ్చి అండగా ఉంటామని స్పష్టం చేశారు.








