Mahaa Daily Exclusive

  అద్దంకి పాలిటిక్స్ ఒకేరోజు ఇద్దరు కీలకనేతలతో భేటీ…!

Share

నల్లగొండ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ సోమవారం నల్లగొండ కీలక నేతలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. దీంతో తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలుకు చెక్ పెడుతూ.. తుంగతుర్తి పాలిటిక్స్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకే దయాకర్ వీరిని కలిశారా? అన్న చర్చ జరుగుతోంది. కొద్ది గంటల వ్యవధితోనే అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బలమైన కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తుంగతుర్తి నియోజకవర్గంలో బలమైన అనుచరగణం కలిగిన దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తో దయాకర్ కు గతంలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరే దయాకర్ కు టికెట్ దక్కకుండా అడ్డుపడ్డారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు దయాకర్ కు ఏ అవకాశం రాకుండా వీరే చక్రం తిప్పుతున్నారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఉంది. దీంతో వీరితో సయోధ్య కుదుర్చుకునేందుకు దయాకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం దామోదర్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డిని కలిసినట్లు చర్చ సాగుతోంది. అయితే తుంగతుర్తిలో ఉన్న వీరి అనుచరగణం ప్రస్తుత ఎమ్మెల్యే కారణంగా ఉక్కపోతకు గురవుతుండడంతో అద్దంకిని మళ్ళీ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

తుంగతుర్తి ప్రకంపనలు

ప్రస్తుతం తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్న మందుల సామేల్ కు, దామోదర్ రెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. తుంగతుర్తి నియోజకవర్గంతో తన కుమారుడు సర్వోత్తమ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజదర్బార్ నిర్వహిస్తామని దామోదర్ రెడ్డి గతంలో సంచలన ప్రకటన చేశారు. సామేలుకు వ్యతిరేక వర్గం తలపెట్టిన మీటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలనే అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు తరలించడం సంచలనంగా మారింది. కొన్ని రోజులుగా సామేలు ప్రవర్తన కోమటిరెడ్డి బ్రదర్స్ కు కూడా మింగుడు పడడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సామేలుకు చెక్ పెట్టేందుకు మళ్లీ దయాకర్ ను తెరపైకి తెచ్చారా? అన్న విశ్లేషణలు సైతం నల్లగొండ పాలిటిక్స్ లో వినిపిస్తున్నాయి. కేవలం సయోధ్య కోసమే దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దయాకర్ కలిశారా? లేక తుంగతుర్తి పాలిటిక్స్ లో మళ్లీ ఎంట్రీ ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే సామేలుకు ఝులక్ ఇస్తారా? అన్న అంశంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ , ఎంపీ టికెట్ రాకున్నా సహనంతో దయాకర్ గత ఏడాది కాలంగా పార్టీకి సహకరిస్తున్న తీరు క్యాడర్ మనసు గెలిచింది. దీంతో విభేదాలు పక్కనపెట్టి ఇపుడు దయాకర్ నాయకత్వాన్ని కోరుకుంటున్న నేతల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అద్దంకి కార్యాచరణ నల్లగొండ పాలిటిక్స్ లోనే కాకుండా తెలంగాణలోనూ సంచలనంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి.