డొనాల్డ్ రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం మధ్యాహ్నం(అమెరికా కాలమానం ప్రకారం) అతిరథ మహారథుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వాషింగ్టన్‌లో తీవ్రమైన చలి ఉంది. దీంతో ఈసారి ఈ కార్యక్రమాన్ని భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో నిర్వహించారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవానా ప్రమాణం చేయించారు. పక్కన తన కుమార్తెను ఎత్తుకుని ఉషా వాన్స్ నిల్చున్నారు. ప్రమాణం అనంతరం అక్కడున్న వారంతా కేరింతలతో జేడీ వాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు, ట్రంప్ అభిమానులు హాజరయ్యారు. అమెరికాతో సంబంధాలకు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, భారత్ సైతం వాషింగ్టన్‌తో భారత్ సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తోంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ తన సతీమణి జిల్‌తో కలిసి శ్వేత సౌధంలో చివరి సెల్ఫీ తీసుకున్నారు. ఐలవ్యూ అమెరికా అంటూ పోస్ట్ చేశారు.
భారత్ తరుపున
భారతదేశం నుంచి ప్రధాని మోదీ తరఫున ట్రంప్ ప్రమాణ స్వీకారానికి విదేశాంగమంత్రి జైశంకర్ హాజరయ్యారు. అలాగే ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు కూడా వచ్చారు. ప్రపంచ వ్యాపార దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, సామ్ ఆల్ట్‌మన్, సుందర్ పిచాయ్ వంటివారు హాజరయ్యారు. ఈసారి ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ ఖర్చులు కోసం దాదాపు రూ.1,400 కోట్ల విరాళాలు సేకరించారు. దీనికి బెజోస్, జుకర్ బర్గ్, ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహీనే చెరో రూ.8,65 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి భారీగా విరాళాలు అందించిన పెద్ద స్థాయి దాతలకు ప్రత్యేక ప్రైవేటు విందును ఏర్పాటు చేశారు.
నీ దూకుడు సాటెవ్వడు
దూకుడు ట్రంప్ నైజం. ఏటికి ఎదురీదడం ఆయన తత్వం. తెంపరితనం ఆయనకు ఆయుధం. వాటినే అస్త్రాలుగా మల్చుకొని అగ్రరాజ్య అధినేతగా రెండు సార్లు విజయం సాధించారు. ఆయనే డొనాల్డ్ ట్రంప్. తన దూకుడుతో రియల్ ఎస్టేట్ టైకూన్‌గా ఎదిగిన ట్రంప్ రాజకీయ రంగంలో మరింత దుందుడుకు వైఖరితో అమెరికన్ల హృదయాలు కొల్లగొట్టారు. ఎన్నో ఆరోపణలు, మరెన్నో కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండారెట్టించిన మొండిధైర్యంతో రెండోసారి అమెరికా పీఠాన్ని అధిష్టించి వావ్ అనిపించారు.








