మహాకుంభమేళాకు భారీగా భక్తులు హాజరవుతున్నారు. యూపీలోని ప్రయాగరాజ్ లో ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద జాతర. జనవరి 13న ప్రారంభమైన ఈ జాతర ఫిబ్రవరి 26న ముగియనుంది. మొత్తం 45 రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమానికి 40 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశముందని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. తొలిరోజు భక్తులు భారీగా పోటెత్తిన విషయం తెలిసిందే. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద దాదాపు 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. మహాకుంభమేళకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు త్రివేణి సంగమం వద్ద 22.79 లక్షల మంది భక్తులు స్నానం ఆచరించగా, ఇప్పటివరకు 8.5 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు హాజరైనట్లుగా పేర్కొన్నారు. దీంతో భారీగా వస్తున్న భక్తులతో మహాకుంభమేళా కిటకిటలాడుతోంది. ప్రయాగరాజ్ భక్తిపారవశ్యంతో కనిపిస్తోంది.
కుంభమేళాకు క్యూ కడుతున్న విదేశీయులు
కేవలం భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ప్రయాగరాజ్ ను సందర్శించి, త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తున్నారు. ఫిజీ, ఫిన్లాండ్, గుయానా, మలేసియా, మౌరిటియస్, సింగపూర్, సౌతాఫ్రికా, శ్రీలంక, త్రినిడాడ్ అండ్ టోబాగో, యూఏఈతోపాటు పలు దేశాల నుంచి విదేశీయులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఈసారి విదేశీ పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటు స్వదేశీయులు, అటు విదేశీయులతో ప్రయాగ్ రాజ్ సందడిసందడిగా మారింది. దీంతో కుంభమేళాలో ఎటు చూసినా జన సందోహమే కనిపిస్తోంది.
విదేశీ మీడియా సైతం ఫోకస్..
మహాకుంభమేళా ప్రపంచాన్ని ఆకర్శిస్తిస్తోండడంతో విదేశీ మీడియా కూడా ఫోకస్ చేసింది. ప్రత్యేకంగా కవరేజ్ చేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కుంభమేళాపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశీయులు విచ్చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
కుంభమేళాకు రానున్న ఎలాన్ మస్క్..?
మహా కుంభమేళా 2025కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కు కూడా వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని ఆయనతో సన్నిహితంగా ఉండే పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కుంభమేళాకు హాజరుకావాలని ఆయనను ఆహ్వానించగా అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారంటూ రితేష్ తోపాటు పలువురు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
22న యూపీ కేబినెట్ ప్రత్యేక సమావేశం
భారీగా ఏర్పాట్లు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది. ఆదివారం అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే, సంబంధిత అధికారులు, సిబ్బంది ఎప్పుడూ అలర్ట్ గా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది ఆ మంటలను ఆర్పివేశారు. ఇలా పూర్తిస్థాయిలో మహాకుంభమేళాలో భక్తులకు భారీ భద్రతను యూపీ ప్రభుత్వం కల్పిస్తోంది. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఈ నెల 22న యూపీ ప్రభుత్వం ప్రత్యేక సమావేశమై, మహా కుంభమేళాకు సంబంధించి చర్చించనున్నారు. కుంభమేళా ఎలా కొనసాగుతోంది..? బడ్జెట్, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలతోపాటు తదితర అంశాలపై చర్చించనుంది.
భారీగా పెరిగిన రేట్లు
అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇటు ప్రత్యేక విమానాలు సైతం నడుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా కూడా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టేషన్లు కుంభామేళాకు వెళ్తున్న భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాగరాజ్ కు భక్తులు భారీగా వెళ్తుండడంతో ఎప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు, ట్రైన్స్, విమానాలను నడుపుతున్నారు. అయితే, పలు విమానయాన సంస్థలు స్పెషల్ సర్వీసెస్ ను నడుపుతున్న మాట వాస్తవమే కానీ, రేట్లను భారీగా పెంచాయంటూ ప్రయాణికులు వాపోతున్నారు.
ఇతర ప్రాంతాలూ కిటకిట
కుంభమేళాతోపాటు ఇతర ఆధ్మాత్మిక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. గంగా-యమునా నదుల ఒడ్డున ఉన్న బడే హనుమాన్ ఆలయం, ఆనంద్ భవన్, అలహాబాద్ కోట, చంద్రశేఖర్ ఆజాద్ పార్క్, ఖుస్రో బాగ్ తోపాటు పలు ప్రాంతాలను పర్యాటకులు సందర్శిస్తున్నారు. దీంతో ప్రస్తుతం యూపీలో ఎక్కడ చూసినా సందర్శకుల సందడి నెలకొంది.
గూగుల్‌లోనూ కుంభమేళాకు గులాబీల వర్షం…
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ అయినటువంటి గూగుల్ సంస్థ కూడా మహాకుంభమేళాకు ప్రత్యేక ప్రిపరెన్స్ ను ఇస్తోంది. సృజనాత్మకంగా సెలబ్రేట్ చేస్తోంది. కుంభమేళా లేదా మహాకుంభమేళా అని గూగల్ లో సెర్చ్ చేయగానే గులాబీ రేకులతో కూడిన వర్చువల్ యానిమేషన్ ఆకర్షణగా నిలుస్తోంది. గులాబీల వర్షం పడుతున్నట్లుగా ఎంతో ఆసక్తిగా పేజీ కనిపిస్తోంది. ఇలా గూగుల్ కుంభమేళా ప్రాముఖ్యతను గుర్తుచేస్తోంది.
ప్రభుత్వానికి భారీగా ఆదాయం
కుంభమేళాకు భక్తులు భారీగా తరలిరావడంతో అక్కడి ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. సుమారుగా రూ. 2 నుంచి 5 లక్షల కోట్ల వరకు ఆదాయం రావొచ్చని ప్రభుత్వం అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే, 2019లో జరిగిన కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు తరలిరాగా, అప్పుడు యూపీ ప్రభుత్వానికి రూ. 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని ప్రభుత్వం పేర్కొన్న విషయం విధితమే. ఈసారి కుంభమేళాకు 40 కోట్లకు పైగా భక్తులు హాజరవుతారని, ఆదాయం కూడా ప్రభుత్వానికి భారీగా సమకూరుతుందని అంచనా వేస్తోంది.








