కడప జిల్లా రవాణాశాఖలో ఓ కీచక అధికారి కామంతో కార్యాలయ మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. డిటిసీగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ రెడ్డే ఆ కీచక అధికారి కావడం విశేషం. ఈ అధికారి వేధింపులకు ఇటీవల ఓ అధికారిణి బదిలీపై వెళ్లిపోగా, మరో అధికారిణికి వాట్సప్లో అసభ్యకర సందేశాలు పంపుతుండడంతోపాటు తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేస్తున్నాడు. నన్ను ఇబ్బంది పెట్టొద్దని, మీ కుమార్తె కంటే చిన్నదానినని, నన్ను వదిలేయాలని బతిమాలారు. ఈ నేపథ్యంలో అధికారిణి భర్త ఉద్యోగరీత్యా పక్క జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్న సదరు అధికారి గురువారం ఉదయం నేరుగా ఆమె ఇంటికెళ్లారు. దీంతో ఆమె సీసీ కెమెరాల్లో అతడి రాకను గమనించి భర్తకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. సీసీ కెమెరాలను తన ఫోన్కు అనుసంధానించుకున్న ఆమె భర్త కామాంధుడైన అధికారి చేష్టలు గమనించారు. తలుపు తడుతూ మహిళా అధికారిణి పిలిచే ప్రయత్నం చేయగా ఆమె స్పందించలేదు. కొంత సేపు ప్రయత్నించిన అధికారి ఆమె ఇంటి ముంగిటే కూర్చున్నారు.
ఇవన్నీ గమనించిన అధికారిణి భర్త అధికారికి ఫోన్ చేయగా.. స్పందించ కుండా అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పక్క జిల్లా నుంచి తిరిగి వచ్చి అధికారిణి భర్త భార్యను వెంటబెట్టుకుని కార్యాలయానికి వెళ్లి కీచక అధికారిని చితకబాదారు. దీంతో బాధితురాలి కాళ్లపై పడి వేడుకోవడంతో వదిలిపెట్టారు. ఈ వ్యవహారం బయటకు రాకుండా రక్షించాలని అధికారి ఉద్యోగులు, సిబ్బందిని వేడుకున్నారు. బాధితురాలితో పాటు అమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తనను ఆదుకోవాలని ప్రాధేయపడ్డారు. పైరవీల ద్వారా కడప స్థానాన్ని దక్కించుకున్న సదరు అధికారి గతంలో బాపట్లలోనూ ఇలాంటి కార్యకలాపాలే సాగించినట్లు ఆరోపణలున్నాయి.
తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం – డిటీసీ పై సస్పెన్షన్ వేటు :
ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సదరు అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మహిళా ఉద్యోగులకు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిర్లక్ష్యంగా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర కమిషన్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా అతడిపై శాఖ పరమైన విచారణకు ఆదేశించారు.
కార్యాలయంలో విచారణ చేపట్టిన జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ కృష్ణ వేణి :
కీచక డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి ఉదంతంపై ప్రభుత్వం ఆదేశించిన వెంటనే జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ బి.కృష్ణ వేణి రంగంలోకి దిగారు. జిల్లా రవాణాశాఖాధికారి కార్యాలయంలో అమె విచారణ చేపట్టారు. డిటిసి చంద్రశేఖర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై బాధిత ఉద్యోగి నుంచి, ఆమె భర్త నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశామని, కార్యాలయంలోని సిసీ పుటేజిని పరిశీలించామని, ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని అమె చెప్పారు.








