Mahaa Daily Exclusive

  సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్ – ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలి – కడప కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి…

Share

ఎన్నికల ముందు కూటమి చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని కడప కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి ,పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ధ్రువకుమార్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. శనివారం పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు థాలీ భజావో కార్యక్రమం పేరిట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లేట్లు – స్పూన్లతో శబ్దం చేస్తూ మొద్దు నిద్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 227 రోజులని, ఇప్పటి వరకు సంక్షేమ పెన్షన్లు, ఉచిత గ్యాస్ తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పథకాలను అమలు చేయలేదన్నారు. కమిటీలతో, ప్రణాళికలతో కాలయాపన చేస్తున్నారని, బాబు షూరిటీ…. భవిష్యత్తు గ్యారంటీ అని… బాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా మూలన పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు అర్థాంతరంగా చదువులకు దూరం అవుతున్నారని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని విజయ జ్యోతి మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే దాదాపు రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉందని, నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యానని, 1995 నుండి దావోస్ కి వెళుతున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ కు ఒక్క పెట్టుబడి కూడా ఆకర్షించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలు అమలు చేయడం మినహా కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, నియోజకవర్గ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.