ప్రపంచంలోనే అతిపెద్దప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో
ఓటు హక్కు ఓ వజ్రాయుధమని, తన ఓటు హక్కుతో దేశాన్ని శాసించగల శక్తి ఓటర్లందరికీ ఉందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లోని సభాభవన్ లో 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి హాజరు కాగా, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు,ఆర్డీవో జాన్ ఇర్వీన్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ…దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఎంతో విలువైన ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ప్రజాస్వామ్య విలువలను చాటుకుంటూ ప్రపంచ దేశాలకు మన దేశం గీటు రాయిగా నిలిచిందన్నారు.అనేక మంది వారి స్వాతంత్ర సమరయోధులు తమ జీవితాలను త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారని అన్నారు.ఈ స్వతంత్ర దేశంలో పౌరులందరికీ కుల, మత, భాష,లింగ, అక్షరాస్యులు, నిరక్షరాశులు, థర్డ్ జెండర్ అనే తారతమ్యాలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును రాజ్యాంగం ప్రసాదించిందన్నారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విలువైన ఓటును నమోదు చేసుకోవాలని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మన విధిగా బాధ్యతాయుతంగా వినియోగించుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొత్త ఓటర్ల నమోదుపై ఓటుహక్కును అందరికీ కల్పించేందుకు ప్రతి ఏటా ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. అందులో మనం బాగస్వాములమై ఓటరు నమోదు పై అవగాహన పెంచాలన్నారు. అంతకుముందు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని… జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం ముద్ర అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.








