Mahaa Daily Exclusive

  పామాయిల్ ప్లాంటేషన్ ద్వారా అధిక ఆదాయం – ఐటీడీఏ పీవో సి యశ్వంత్ కుమార్ రెడ్డి

Share

పామాయిల్ ప్లాంటేషన్ ద్వారా గిరిజన రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందని ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన చిన్నబగ్గ గ్రామంలో పామాయిల్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.

పామాయిల్ ప్లాంటేషన్ ను గిరిజన రైతులకు 100 శాతం సబ్సిడీతో ఇస్తున్నట్లు పీవో తెలిపారు. చిన్నబగ్గకు చెందిన గిరిజన రైతుకు ఎకరాకి 50 మొక్కలు చొప్పున రెండు ఎకరాల్లో 100 మొక్కలను గురువారం నాటారు. దీనివల్ల ఎక్కువ ఆదాయం గిరిజన రైతులకు లభిస్తుందని పీవో అన్నారు.

అనంతరం చిన్నబగ్గలోని మినీ అంగన్వాడి కేంద్రాన్ని పీవో పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో అంగన్వాడీలోని చిన్నారులకు అర్థమయ్యేలా చదువు చెప్పాలని అంగన్వాడి వర్కర్ కు సూచించారు. చిన్నారులకు ఆటపాటలతో విద్య నేర్పించాలని అన్నారు.

అనంతరం మర్రిపాడు పీహెచ్ సీని పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్ సిలో మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణ బాగుందని అన్నారు.

అదే విధంగా పూతికవలస ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని సిబ్బందికి సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల్లో ఉన్న అదనపు తరగతుల భవన సమస్యను, త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.

అనంతరం పూతికవలస సబ్ సెంటర్ ను పరిశీలించారు. సబ్ సెంటర్లో రోగులకు ప్రథమ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అంతకుముందు సీతంపేటలోని పాత పనుకువలస వద్ద MSME పార్కు ఏర్పాటుకు కేటాయించబడిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ MSME పార్క్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో పీహెచ్ వో వెంకట గణేష్, హెచ్ వో జయశ్రీ, శాంతి ఆయిల్ ఫామ్ కంపెనీ మేనేజర్ శ్రీనివాసరావు, తహశీల్దార్ అప్పలరాజు, ఆర్ఐ, ఏపీఐఐసీ డిప్యూటీ తహసీల్దార్, మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.