ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 08.00 నుంచి సాయంత్రం 04.00 గంటల వరకు జరగనుందని, దీనికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను జిల్లా అధికార యంత్రాంగం మొదలు పెట్టిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 29వ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ 24 గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయపరమైన పోస్టర్లు, ఫోటోలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఫిబ్రవరి 03 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 03వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఆ రోజు నుంచి అన్ని ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11.00 నుంచి సాయంత్రం 03.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్ అన్నారు. 10వ తేదీ సాయంత్రం 03.00 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని, 11న పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. 27వ తేదీ ఉయం 08.00 నుంచి సాయంత్రం 04.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 03వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 08వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని కలెక్టర్ వివరించారు. జనరల్ అభ్యర్థులు రూ.10,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫారం-26 ద్వారా అఫడవిట్ సమర్పించాలన్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా అన్ని రకాల నిబంధనలు అభ్యర్థులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఓటర్లు 4829… పోలింగ్ కేంద్రాలు 31
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లా పరిధిలో 4829 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 3275, కాగా మహిళా ఓటర్లు 1554 మంది ఉన్నారని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు నామినేషన్ ప్రక్రియ ముగియడానికి పది రోజుల ముందు వరకు అనగా జనవరి 31వ తేదీ సాయంత్రం 03.00 గంటల వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు సమకూరుస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణకు 30 బృందాలు :
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్ట అమలుకు చర్యలు తీసుకున్నామని, దానిలో భాగంగా ఎంపీడీవో, వీడియో గ్రాఫర్ తో కూడిన 30 ఎంసీసీ బృందాలను మండలానికి ఒకటి చొప్పున నియమించామని కలెక్టర్ చెప్పారు. అలాగే మండలానికి ఒకటి చొప్పున తహసిల్దార్, ఎస్ఐ, వీడియో గ్రాఫర్ తో 30 ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
ముఖ్యమైన తేదీలు :
– నోటిఫికేషన్ల జారీ | 03 ఫిబ్రవరి, 2025 |
– నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ |10 ఫిబ్రవరి|
– నామినేషన్ల పరిశీలన | 11 ఫిబ్రవరి |
– అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ |13 ఫిబ్రవరి|
– పోలింగ్ తేదీ | 27 ఫిబ్రవరి |
– పోలింగ్ వేళలు | ఉదయం 08:00 నుండి సాయంత్రం 04:00 వరకు |
– ఓట్ల లెక్కింపు | 03 మార్చి, 2025 |
– ఎన్నికలు ప్రక్రియ పూర్తి | 08 మార్చి, 2025 |








