Mahaa Daily Exclusive

  అత్యాశ ఎవరిది…..? వీకెండ్ అనాల‌సిస్ By కంది రామ‌చంద్రారెడ్డి…!

Share

కేంద్ర బడ్జెట్ లో ఎప్పటిలాగే తెలంగాణకు రిక్తహస్తం అందించారు. ఎన్నికల రాష్ట్రాలే తమ ప్రాధాన్యమని మోదీ మార్క్ నమూనాను కేంద్ర బడ్జెట్ లో స్పష్టంగా ఆవిష్కరించారు. అత్యాశకు పోయి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పద్నాలుగు మాసాల తన అంతర్గత సమీక్ష తర్వాత తేల్చేశారు. తప్పుమీదే.. అనుభవించండి. మళ్ళీ నేనొచ్చినా మార. అదే పాలన. అదే లెక్క అని కేసీఆర్ సంకేతాలిస్తున్నారు. బిఆర్ఎస్ లో ఇద్దరికి మాత్రమే పదవులున్నాయి. ఒకటి అధ్యక్షుడు కేసీఆర్, రెండవది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీకి ఏళ్ళకేళ్ళుగా కార్యవర్గాలు లేవు. బిఆర్ఎస్ ఎల్పీ నేత కేసీఆర్. తర్వాత పదవులు ఎవరికీలేవు. రెండు ఎన్నికల్లో చేదుఫలితాలు వచ్చి, ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. ఇంకా నేను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన ధీమాకు అద్దం పడుతుండగా, గద్దర్ పై బండిసంజయ్ వ్యాఖ్యలు విస్మయపరుస్తున్నాయి. ఎనిమిది మంది ఎంపీలున్నా తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిని ఎలా చల్లారుస్తారో చూడాలి.

తాజా రాజకీయ పరిణామాలపై ఎఎన్ఎన్ సీఈవో , జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలసిస్

అత్యాశకు పోయి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పద్నాలుగు మాసాల తన అంతర్గత సమీక్ష తర్వాత తేల్చిన సారం. కేసీఆర్ ను ఎన్నుకోకపోవడం ప్రజలదే తప్పు తప్ప.. కేసీఆర్ ది కానీ ఆయన కుటుంబానిది గానీ, నియోజకవర్గాలను సామంతరాజ్యాలుగా చేసుకున్న వారిది కానీ కాదని ఆయన చెప్పదలుచకున్నారు. ఓటమి నుండి ఎవరైనా పాఠాలు నేర్చుకుంటారు. భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేసి ఉండవచ్చు. కానీ ఆయన పక్కన ఉండే నేతలు గానీ, ఉద్యమకాలం నుండి గులాబీజెండా ను కాయలుకాసేలా మోసిన కార్యకర్తలు గానీ చెప్పింది వినకుండా.. అనేక తప్పులు చేశారు. గాయాలు చూశారు. మంచిని మించి తప్పులు జరిగాయి కాబట్టే పీఠం నుండి ప్రజలు పక్కకు జరిపారు. అయినా ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు మంచి గుణపాఠమైందని చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కేసీఆర్ కు మాత్రమే సాధ్యం. కేసీఆర్ బెదిరించగలడు. లాలించగలడు. కానీ ప్రజల మనస్సును అర్ధం చేసుకోకుండా ఇప్పటికీ మీరైతే తప్పుచేసిండ్రు గానీ.. ఈసారి గెలిపియ్యండ్రి నేను సూసుకుంటా అంటూ అదే మాటలు చెబుతున్నారు. కేసీఆర్ విజయాలకు కారణం కేసీఆరే. కేసీఆర్ ఓటమికి కారణం కేసీఆరే. ఈ రెండు కేసీఆర్ తో ప్రజలకు ఉన్న అనుబంధానికి, ఆగ్రహానికి సంకేతాలు. ఏ రాజకీయనాయకుడు కూడా.. ప్రజలు నిజంగా కష్టాల్లో ఉన్నారని భావిస్తే సంబురపడడు. అవహేళన చేయడు. ప్రజలకే అత్యాశ ఉంటే కేసీఆర్ కుటుంబం ఏ ఆశలు లేకుండానే పనిచేసిందా? కుటుంబమంతా ప్రభుత్వంలోకి పదవుల్లోకి ఎందుకొచ్చింది? టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఎందుకు మారింది? ఇలా అనేక ప్రశ్నలు తెలంగాణ సమాజం నుండి, క్యాడర్ నుండి రాకుండా ఉంటాయా? నేను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ అంటున్నారు. 2023 నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కొట్టినదాన్ని ఏమంటారో కేసీఆర్ కే తెలియాలి.

..
కేసీఆర్ అదునుకోసం ఎదురుచూస్తున్నాడు. ఏ ప్రతిపక్ష నాయకుడైనా అదే చేస్తాడు. కానీ కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లకుండా.. మీరు తప్పుచేశారు మీరు తప్పుచేశారనే పాఠం పదేపదే చెబుతూ తన ఇంటికే పరిమితమయ్యాడు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రతిరోజూ ప్రజల్లో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ లో కేసీఆర్ ఎవరికీ పదవులు ఇవ్వలేదు. పార్టీ కార్యవర్గం నియమించలేదు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ కు మాత్రమే పదవులున్నాయి. ఇంకెవరికీ పదవులు లేవు. కానీ ప్రతిరోజూ సామాజిక న్యాయం గురించి, ప్రజలకు జరిగే అన్యాయాల గురించి, పథకాల లోపాల గురించి మాట్లాడుతుంటారు. అసెంబ్లీ ఎన్నికలముందే కాక.. ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ఏరోజు ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ గెలిచే స్థానాలు నూటా పది అని చెప్పేవారు. రాసి పెట్టుకోండి అనేవారు. కేసీఆర్ లెక్క తప్పింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల సమయంలోనూ చెప్పారు. ఇపుడు సోషల్ మీడియా పోల్ గురించి కూడా సంబురపడుతూ చెబుతున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా చేసిన తప్పిదం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. ఏడాదిలోనే ఏ ప్రభుత్వాలు అద్భుతాలు చేయలేవు. 2014లో వచ్చిన కేసీఆర్ కూడా ఏడాదిలో హామీలన్నీ అమలు చేయలేదు. ప్రజామోదం పెంపొందించుకుంటూ వెళ్ళారు. ప్రజాక్షేత్రంలో నాయకులు, ప్రజలను నమ్ముకోవడం కంటే సోషల్ మీడియాను, ఫేక్ వార్తలను నమ్ముకోవడం మంచిదనే స్థితికి బిఆర్ఎస్ పెద్దలు వచ్చారా? లేక నిర్మాణాత్మకంగా తెలంగాణ ప్రజల బాగుపడేందుకు పనిచేస్తున్నారా? అన్నదానిపైతాజా చర్యలు సందేహాన్ని ఆందోళనను కలిగిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్ ను తెలంగాణలో కోరుకునే వాతావరణం ఉందా? తప్పులు సరిదిద్దుకోకుండా, ప్రజాకంటకంగా మారిన నేతలను, పద్దతులను పక్కనపెట్టకుండా.. ఇప్పటికీ పార్టీలో ఎవరినీ నమ్మకుండా మళ్ళీ నేనే అంటున్న కేసీఆర్ ను పౌరసమాజం నెత్తినపెట్టుకుంటుందా? అన్నది సమాధానం దొరకాల్సిన ప్రశ్న.

….
ఓవైపు గద్దర్ పై కేంద్రమంత్రి బండిసంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏ రాజకీయ ప్రయోజనం కోరుకుని చేసినా తెలంగాణ సమాజం హర్షించడం లేదు. గద్దర్ తెలంగాణ కోసం పనిచేసిన నాయకుడు. రాజ్యంపై తిరగబడి గొంతులేనోళ్ళ గొంతుకైన నాయకుడు. గద్దర్ భావజాలాన్ని ప్రశ్నించడం, సమర్ధించుకోవడం వెను ఉద్దేశ్యాలు స్పష్టం కావాల్సి ఉన్నది. గద్దర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ప్రసంగం పౌరసమాజానికి ఆయనను దగ్గర చేసింది. గతంలో ఏ అభిప్రాయమైనా ఉండొచ్చు.. ముఖ్యమంత్రిగా భిన్నవాదనలు, భిన్న మనస్తత్వాలు, భిన్న భావజాలాలను ఆయన స్వాగతిస్తున్నారు. లక్షన్నర కోట్లకు పైగా పెట్టుబడుల సాధన తర్వాత ఓవైపు విపక్షం ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రిగా రేవంత్ సుస్థిరమవుతున్నారు. నాలుగు పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం మెల్లిగా వాటిని అమలు చేస్తోంది. స్థానిక ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు గీటురాయి. ప్రజలు కోరుకుంటే బీఆర్ఎస్ వీటిలో ఫలితాలు సాధించొచ్చు. ప్రతిపక్షనేతగా అసెంబ్లీకి రాకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకుండా మళ్ళీ మనమే అంటూ చేస్తున్న ప్రకటనలు బిఆర్ఎస్ గందరగోళానికి నిదర్శనంగా కనబడుతున్నాయి. ఇవన్నీ ప్రజల ముందు కదలాడే దృశ్యాలే.
..
తెలంగా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో మరోసారి మొండిచెయ్యి చూపారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుండీ తెలంగాణ విషయంలో కేంద్రం వైఖరి అవమానకరంగానే ఉంది. ఢిల్లీనేతలు తెలంగాణకు ప్రత్యేక ప్రాజెక్టులకు పెద్దగా మంజూరీచేసిన దాఖలాలు లేవు. ఎనిమిది మంది ఎంపీలున్నా ఇంకా విభజన హామీల గురించి అడుక్కోవడం విషాదమే. రాష్ట్రంలోని సగం ఎంపీ స్థానాలు కట్టబెట్టిన తర్వాత కూడా.. ఎపి, బిహార్ తరహాలో తెలంగాణకు నామమాత్రంగా కూడా వరాలు ఇవ్వలేదు. ఎన్నికలే తప్ప తమకు రాష్ట్రాలు ప్రాధాన్యం కాదని కేంద్రం పదేపదే తమ చర్యల ద్వారా సంకేతాలిస్తున్నది. తెలంగాణ ప్రజల పక్షాన తాము లోక్ సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైనా నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఎంపీలపై ఉంది.