వసంత పంచమిని భారతదేశంలోని హిందువులంతా విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకునే వసంత పంచమిని.. శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతి జన్మించిన రోజు. సరస్వతి దేవిని మాఘపంచమి నాడు శ్రీ పంచమిగా ఆరాధిస్తారు. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నముగా ఈ పంచమని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతిదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీపంచమి నాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల దంపతుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి.
వసంత పంచమి విశిష్టత :
సరస్వతీదేవి మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.
అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.








