Mahaa Daily Exclusive

  కేటిఆర్ వ్యాఖ్యలను బిసి సమాజం క్షమించదు – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

Share

కుల‌గ‌ణ‌న స‌ర్వేపై కేటీఆర్ వ్యాఖ్య‌లను బీసీ స‌మాజం క్ష‌మించ‌దని , తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌న స‌ర్వే పారద‌ర్శ‌కంగా జ‌రిగిందని, కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బిసి కులగణనను తప్పులు తడక అంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైరయ్యారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇల్లిల్లు పరిశీలన చేసి గణన చేయడం జరిగిందన్నారు. కులగణన దేశానికే ఆదర్శంగా చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం కుల‌గ‌ణ‌న స‌ర్వేను కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంక‌ల్పంతో పూర్తి చేసిందన్నారు. 1931 తర్వాత కులగణన జరిగిందని, ఇది బీసీ లకు ఎంతో మేలు చేసిందన్నారు. పక్కాగా పకడ్బందీగా కులగణన ను దేశంలోనే మొదటిసారి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. 2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడడం అవివేకమన్నారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేక పోతున్నారన్నారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో పాల్గొన‌ని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రీ – స‌ర్వే గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉందన్నారు. బ‌ల‌హీన‌వ‌ర్గాల గురించి కేటీఆర్ మాట్లాడ‌టం హాస్యాస్పదమని, ప‌దేళ్ల బిఆర్ఎస్ పాల‌న‌లో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బిఆర్ఎస్‌- బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీచేయడానికి బిఆర్ఎస్ పార్టీకి అభ్య‌ర్థులు క‌రువయ్యారన్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌రోక్షంగా బీజేపీకి బిఆర్ఎస్‌ మద్దతునిస్తున్నదని మండిపడ్డారు.