Mahaa Daily Exclusive

  మహా కుంభమేళాలో 50కోట్ల మందికిపైగా భక్తుల పుణ్యస్నానాలు…!

Share

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్​రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. జనవరి 13న మహాకుంభ మేళా మొదలైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు త్రివేణీ సంగమంలో 50 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
“ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర, సాంస్కృతిక-సామాజిక కార్యక్రమం. ఇప్పటికే 50 కోట్ల మందికిపైగా మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేశారు. భారత్, చైనాలు మినహా మిగతా దేశాల జనాభా కంటే ఈ సంఖ్యే ఎక్కువ. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువే” అని యూపీ సర్కారు తెలిపింది. ప్రయాగ్​రాజ్‌లోని గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానంలో శుక్రవారం ఒక్కరోజే 92 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని పేర్కొంది.

సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పుణ్యస్నానాలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, తన సతీమణి అమృతా ఫడణవీస్, కుమార్తె దివిజలతో కలిసి శుక్రవారం రోజు ప్రయాగ్​రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభ మేళాలో భక్తుల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. ఇందుకుగానూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన అభినందనలు తెలిపారు