Mahaa Daily Exclusive

  కొత్త చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌పై ఉత్కంఠ రాజీవ్ కుమార్ స్థానంలో మరొకరు…!

Share

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియనుంది. కొత్త చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నేతృత్వంలో ఈ ఏడాది చివరన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కాగా రాజీవ్‌ కుమార్‌ 2022 మే నెలలో సీఈసీగా ఎంపికైన సంగతి తెలిసిందే. నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ వచ్చే వారం ప్రారంభంలో సమావేశం కానుంది. ఈ ప్యానెల్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రి కూడా ఉన్నారు. ప్రస్తుతం 25వ చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న రాజీవ్‌ కుమార్‌ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం లేదా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సమావేశమై కొత్త సీఈసీని ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో కమిటీ ఒకరి పేరును సిఫార్సు చేయనుంది. ఆ సిఫార్సు ఆధారంగా కమిటీ అధ్యక్షుడు తదుపరి సిఈసిని నియమిస్తారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్ కుమార్ తర్వాత.. జ్ఞానేష్ కుమార్ అత్యంత సీనియర్ ఎన్నికల కమిషనర్. ఆయన పదవీకాలం జనవరి 26, 2029 వరకు ఉంది. అదే సీనియార్టీతో సుఖ్‌బీర్ సింగ్ సంధు అనే మరొక ఎన్నికల కమిషనర్ కూడా ఉన్నారు. గతంలో సీనియర్టీని బట్టి సీనియర్ ఎన్నికల కమిషనర్‌ను సీఈసీగా నియమించే ఆచారం ఉండేది. కానీ 2023లో సిఈసి, ఈసిల నియామకాలకు సంబంధించి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రధాని నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సెలెక్షన్‌ కమిటీ ఐదుగురు కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లను ప్యానెల్ పరిశీలన కోసం షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ఈ కమిటీలో ప్రధానితోపాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ కొత్త సీఈసీ పేరును ఖరారు చేస్తారన్నమాట. సీఈసీ హోదాలో రాజీవ్‌ కుమార్‌ చివరగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రపతి ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలు కూడా రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోనే జరిగాయి