ప్రధాని నరేంద్ర మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి.. ముందు రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా మాట్లాడిన వాళ్లందరూ చరిత్రలో కలిసిపోయారని, రేవంత్ రెడ్డి మాటల్లో చేతగానితనం కనిపిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులగణనలో పాల్గొనాలని చట్టంలో ఉందా? అని ప్రశ్నించారు. సామాజిక బహిష్కరణ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు. అసలు మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని, ప్రధాని మోదీ కేబినెట్‌లో 17 మంది బీసీ మంత్రులు ఉన్నారని.. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఉన్నది ఇద్దరే ఇద్దరు బీసీ మంత్రులు అని ఎద్దేవా చేశారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మోదీ కులం ఓసీ నుంచి బీసీకి వచ్చిందని రేవంత్ రెడ్డి ఇప్పుడే కనిపెట్టినట్లు మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు.







