2025, ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గల చిలుకూరి బాలాజీ దేవాలయంలో ప్రధానార్చకుడుగా పనిచేస్తున్న, మరియు ఆ దేవాలయ ట్రస్ట్ కు ప్రధాన ట్రస్టీ గా ఉన్న రంగరాజన్ పై జరిగిన దాడి వార్త – ఇప్పుడు (గత వారం రోజులుగా) రెండు తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగిస్తున్న వార్త! దాడి జరిగిన రెండ్రోజుల తర్వాత సదరు రంగరాజన్ సంబధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం; షుమారు అదే సమయానికి దాడికి పాల్పడ్డ ‘రామరాజ్యం’ సభ్యులు – వారు తీసిన వీడియోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేయటంతో రెండు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ‘ఉలిక్కిపడ్డాయి’ అనే పదాన్ని నేనిక్కడ చాలా ఉద్దేశ్యపూర్వకంగానే వాడుతున్నాను. ఇలాంటి మతదాడులు యావత్భారత్దేశంలో గత పది, పదిహేనేళ్లుగా లెక్కకు మిక్కిలి ‘సర్వసాధారణం’గా జరిగిపోతూ ఉంటే, తెలుగురాష్ట్రాలు ఇప్పుడు కొత్తగా ‘ఉలికిపాటు’ కు గురవ్వటమేమిటని నన్నడగొచ్చు మా పాఠక మిత్రులు! నేను మళ్ళీ చెబుతున్నా! తెలుగు ద్విరాష్ట్ర పౌరులు ‘ఉలిక్కిపడ్డారు’, కంగారుపడిపోయారు, కంగాళి అయిపోతున్నారు! కారణం – గతంలో జరిగినవన్నీ హైందవులు – హైందవేతరులైన ముస్లింలు, దళితులు, క్రైస్తవులు తదితరులపై చేసిన దాడులు! ఇప్పటి ఈ దాడి ప్రత్యేకించి- ‘హైందవ మతస్తులచే హైందవ మత పూజారియైన ఓ బ్రహ్మణుడిపై’ జరుపబడ్డ దాడి నిజంగానే ఇది వార్త కాకుండా పోతుందా?!! యావత్భారతీయుల్ని దిగ్భ్రాంతికి గురి చేయకుండా ఉంటుందా??
ఈ వార్తను కవర్ చేయటానికి లెక్కకు మిక్కిలి యూట్యూబ్ చానెళ్లు క్యూ కట్టాయి. వీరవిశ్లేషకులనందర్నీ దించాయి. దాడికి కారణాలను ఏకకోణ, ద్వికోణ, ముక్కోణ, చతుర్కోణాల్లో జల్లెడ పట్టి వెతికాయవి! కానీ, ఈ సారి విశ్లేషకుల్లో తెరమీదికొచ్చింది మాత్రం అత్యధికులు – “హిందూ మఠా(తా)ధిపతులైన బ్రాహ్మణ పండితులే! ఒకే ఒక్క శ్రీ భరద్వాజ తప్ప!! (భరద్వాజ గారు కూడా బ్రాహ్మణుడే అయినా, మతాధికారి కాడు. ఆయనో సెక్యులర్ సీనియర్ జర్నలిస్టు). ఈ పండితులంతా సమస్యను – అంతర్లీనంగా ‘కుల నిమ్నోన్నతుల దృక్కోణం’లోనే మాట్లాడారు! ‘గోవింద సేవ’ అనే ఛానల్ నిర్వాహకురాలు సత్యభామ గారు మాత్రం సమస్యను ‘వైష్ణవులపై శైవుల దాడి’ గా చూడ ప్రయత్నించారు. ఇకపోతే దళితులు అయితే ఈ దాడికి కారణంగా – ‘ఆ మధ్య రంగరాజన్ గారు దళిత పూజారిని భుజానికెత్తుకొన్నందునే నేడు ఆయన పై శూద్రులు దాడి చేశారం’టూ అభిప్రాయపడుతున్నారు.
అయితే… ఈ మధ్యకాలంలో – హిందూమత సంరక్షణ కోసం – ‘శూద్రుల నేతృత్వం’ లో గల్లీ స్థాయి నుండి డిల్లీ స్థాయి వరకూ నడుం కట్టిన అనేక సంస్థలు, ఛానెళ్లు వాని అధిపతులు పెద్దగా నోరు విప్పింది లేదు. ఇది విచిత్రంగా కనబడుతున్నా, కొంత ఆలోచన రేకెత్తించే సందేహమే! ఇలా నోరు విప్పని ఛానెళ్లు ఎవరి చేతుల్లో ఉన్నాయోననేది కూడా ప్రశ్నే!
అసలు ‘రామరాజ్యం’ వీర్రాఘవరెడ్డి సంధించిన ప్రశ్నలేంటి? శూద్రుల నేతృత్వంలో నడుస్తున్న ఛానెళ్లు పెద్దగా ఎందుకు స్పందించలేదు అనే ఈ రెండు సందేహాల్ని జతకలిపి చూస్తే – ఇక్కడే మరికొన్ని విలువైన సందేహాలు తలెత్తుతున్నాయి! వ్యాస గమనంలో వాటిని సందర్భానుసారం ప్రస్థావించుకొంటూ వెళదాం.
(వ్యాసం నిడివి పెరిగిపోతున్నా), వ్యాసం లోలోపలికి పోయేముందు – దానికున్న అవసరార్థం – ‘హిందూ మతం ప్రతిపాదిస్తున్న చాతుర్వర్ణ విధి, విధానాలను’ చాలా క్లుప్తంగా గుర్తుచేసుకుందాం! ఈ విధానం ప్రకారం – బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు ‘శిష్ట కులాలు’! చతుర్వర్ణంగా అట్టడుగు భాగంలో ‘పెట్టబడ్డ’వారు శూద్రులు! ఈ శూద్రులకు హిందూ మతంలో ‘భాగస్వామ్యం’ కల్పిస్తూ; వారికి కొన్ని విధి, విధానాలను రూపొందించారు. శూద్రుల ప్రధాన విధి (డ్యూటీ) ఏమిటి? పై మూడు ఆర్య కులాలకు శుశ్రూష – అంటే – (నిర్బంధ సేవ/ కట్టు బానిసత్వం) చేయాలి! ఆనాడు ‘శూద్రులు’గా గుర్తించబడ్డవారెవరు? నేటి కమ్మ, రెడ్డి, వెలమ, కాపు తదితరులే!
ఎప్పుడో వేదకాలంలో నీచస్థాయి, బానిసగుర్తింపు పొందిన శూద్రులు నేడు అదే నీచస్థాయిలో ఉన్నారా? లేదు. కారణం కాలానుగుణంగా జరిగిన అనేకానేక మార్పుల వల్ల నేటి ఇదే శూద్రులు ‘అగ్రవర్ణ’ ‘గుర్తింపు’ వరకూ చేరుకొన్నారు. అదెలా సాధ్యమైంది? నేడు వీరికి ఈ గుర్తింపు హిందూమతం లేదా వైదికధర్మం ‘ప్రసాదించింది’ కాదు. తమకు తాము ‘సాధించుకొన్నది’! తమ సాంస్కృతిక, సంప్రదాయ మూలాలను కాపాడుకుంటూనే కాలానుగుణంగా జరిగిన మార్పులను ఒడిసిపట్టుకొని ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధిచెందటమే కాక; ఆయా రంగాల్లో పట్టు సాధించి, పై మూడు ఆర్య కులాలను కూడా అధిగమించిన దరిమిలా శూద్రులకు ‘సమాజమిచ్చిన గుర్తింపే’ నేటి ఈ ‘అగ్రవర్ణత్వం!’ ప్రతివారు ఇప్పుడు ఆర్యకులాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులతో సమానంగా శూద్రకులాలైన కమ్మ, రెడ్డి, వెలమ, కాపు తదితరులను కూడా ‘అగ్రవర్ణాలు’ అనే పిలుస్తున్నారు. మానసికంగా కూడా సమాజమంతా ఈ శూద్రకులాలను ‘అగ్రవర్ణాలు’గానే చూస్తున్నాయి.
వైదిక కాలం నుండీ కూడా శూద్రులు హిందూమతం ‘లోపలి వారే’! ‘హిందూ మత భాగస్వామ్యులు’ వీళ్ళు. ఇప్పుడున్న ‘అగ్రవర్ణ’ స్థాయితో ఇప్పటికే రాజకీయ ఆర్థిక రంగాలపై ఆధిక్యత సాధించిన శూద్రులు ‘మతం మీద’ కూడా పట్టు, ఆధిపత్యం సాధించాలన్న కోరికకు దూరంగా ఉండగలరని ఎలా అనుకోగలం?! ఇది చాలా విలువైన సందేహం!
ఎందుకంటే –
ఒకటి – ప్రస్తుతం నడుస్తున్న అతివాద మ(ను)త రాజకీయాల వల్ల తాము మళ్ళీ వెనుకటి బానిసస్థాయికి వెళ్ళిపోతామేమోనన్న ‘భయం వల్ల’ కావచ్చు. లేదా
రెండు – అదే మతాన్ని ఉపయోగించుకొని తామున్న ‘అగ్రవర్ణగుర్తింపు’ను రాజకీయాల ద్వారా శాస్వతీకరించుకోవాలన్న ‘కోరిక’ కూడా కావచ్చు. ఈ రెండు కారణాలను వట్టినే భ్రమ పూరిత (illusionery) కారణాలుగా కొట్టివేయలేము.
ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మనుస్మృతినే రాజ్యంగంగా తేవాలన్న ప్రయత్నాలు చేస్తున్నట్టు అందరూ అనుకొంటున్న విషయమే! అదే జరిగితే – మనుస్మృతి ప్రకారం శూద్రులైన ఈ కమ్మ రెడ్డి, వెలమ కాపు కులస్థులంతా తమ ‘ఆస్తి, అంతస్తులు వదులుకొని’ మళ్ళీ బానిస వృత్తుల్లోకి మరలిపోవాలి. ఇలాంటి దుష్పరిణామం లేదా విపత్కర పరిణామం అప్పటికప్పుడు సంభవించకున్నా; కాలక్రమంలో చాలా నెమ్మదిగానైనా సంభవించే అవకాశమున్నందున, రానున్న ఆ ప్రమాదాన్ని నిరోధించేందుకు అనువుగా ఎప్పటి నుండో దీర్ఘకాలిక ప్రణాళికగా ‘రామరాజ్యం’ లాంటి సంస్థల స్థాపనను, వాని కార్యకలాపాలను చూడాలి గానీ; ఈ టెంపుల్ ఎపిసోడ్ ను విడిగా అప్పటికప్పుడు ఆవేశంతో ఉత్పన్నమైన చర్యగా చూడలేము.
మన సందేహాలకు ఊతమిచ్చే – ఈ ఉదంతానికి కాస్త ముందటి భూతకాలం లో సంభవించిన మరో సంఘటన్ను గుర్తు చేసుకుందాం. గత తొమ్మిది, పదేళ్ళ క్రితం – 2016లో కరుణాకర్ రెడ్డి అనే అతని నాయకత్వంలో ఏర్పడ్డ ‘రెడ్డి సంక్షేమ సంఘం’ ఆంధ్రప్రదేశ్ సామాజిక రంగంలో క్రియాశీల పాత్ర పోషించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇది పైకి – రెడ్ల సంక్షేమం, విద్యాభివృద్ధి, లాంటి సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడినట్టు చెప్పుకొన్నా; ఇది ‘యస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కు వ్యతిరేకంగా పోరాటం’ చేయటమే దీని ప్రధాన అజెండాగా అనేక పట్టణాల్లో పనిజేసింది. ఈ ఎత్తుగడతో – యస్సీ ఎస్టీ కులాలపై ఇతర శూద్ర కులాలకున్న విపరీత ద్వేషం వల్ల ఆయా ఇతర శూద్ర కులాలను కూడా తన పోరాటంలో కలుపుకోగలిగింది. ఆధునిక ప్రజాస్వామిక యుగంలో అన్ని రంగాల్లోనూ ముందున్న రెడ్డి కులం – తానేదో ఆత్మరక్షణలో పడిపోయినట్టు రెడ్డి సంక్షేమసంఘాన్ని ప్రారంభించటాన్ని అదేదో ‘తత్కాల్ ప్రోగ్రాం’ గా అనుకోలేము. హైందవ మతం వెలుపలనున్న యస్సీ ఎస్టీల పై ద్వేషాన్ని వెళ్లగక్కటం ద్వారా మిగతా శూద్ర కులాల దృష్టిని, వారి మద్దతును ఇది కూడగట్టగలిగింది.
శూద్ర కులాలు యస్సీ వ్యతిరేక పంథా తోనే ఆపకుండా మరో వైపు బ్రాహ్మణులను కూడా చాలా హీనంగా చూడ్డం మొదలెట్టారు. షుమారు అదే దశాబ్దంలో వచ్చిన చాలా సినిమాల్లో బ్రాహ్మణ వ్యతిరేక విధానాలను, బ్రాహ్మణులను కించపరిచే విషయాలను అనేకం చూపించటం ద్వారా తమ ఆధిపత్య పైత్యాన్ని బలమైన సినీమా మాధ్యమం ద్వారా బాహాటంగానే ప్రదర్శించారు. ఒక సినిమాలో అయితే బ్రాహ్మణ స్త్రీలను ‘వెలయాలులు’ గా చూపే ప్రయత్నం చేసినందున బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోర్టులకు కూడా పోయాయి. అంటే – వ్యక్తిత్వ హననం ద్వారా ఆర్య కులాలను కించపరుస్తు, తమ ఆధిపత్యాన్ని పెంచుకోవాలన్న అజెండా ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. దీని పునాదులు పది, పదిహేనేళ్ల క్రితమే పడ్డాయని అనుకోవాలి.
ఇక వర్తమాన కాలాన్ని చూస్తే – ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింగిల్ మెజారిటీ శూద్ర కులంగా కాపు కులముంది. ఈ కులం ఆర్థిక రంగంలో ఇంకా స్వావలంబన దశకు చేరలేదు. రాజకీయ రంగంలో ఈ కులస్తులు ‘రాజకీయాధికారం’ వరకూ చేరుకోగలిగారు గానీ, ‘ప్రభుత్వాధికార కైవస’ దశకు ఇంకా పూర్తిగా చేరలేదు. అయితే అనూహ్యంగా దాదాపు తొమ్మిది మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో మరో రెండు పార్టీల పొత్తుతో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ద్వారా ప్రభుత్వాధికార భాగస్వామ్యాన్ని పొందగలిగారు. అధికారాన్ని పొందిన తర్వాత వెంటనే ఆ పార్టీ అధినాయకుడు చేపట్టిన ‘సనాతన ధర్మ పరిరక్షణ’ కార్యక్రమం చూస్తే; అప్పటికప్పుడు అది తమ ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టటానికి వాడుకోబడిన ‘లడ్డు రాజకీయం’లా అనిపించినా; ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని దక్షిణ భారత దేశమంతా విస్తృతి చేస్తూ, ఆయన పర్యటనలు చేస్తూ ఉండటాన్ని చూస్తూ ఉంటే – శూద్ర కులాలన్నీ ‘మతరాజకీయ అజెండా’ పై ఏకాభిప్రాయానికి, ఏకతాటి మీదకు వచ్చాయా అన్న సందేహం కలగక మానదు. మతం పునాదుల మీదనే నేటి మొత్తం రాజకీయాలు నడుస్తున్న తీరును బట్టి – ‘ఇప్పుడు కాకుంటే, మరెప్పటికీ కాదు’ అనే తీర్మానానికి శూద్ర కులాలు వచ్చి ఉండొచ్చన్న సందేహాన్ని తేలిగ్గా కొట్టేయలేము!
ఇప్పుడు మళ్ళీ తాజా సంఘటనలోకి వద్దాం. వీర్రాఘవరెడ్డి రంగరాజన్ను ముట్టడించినప్పుడు ఆయన వ్యవహార శైలి అంతా రంగరాజన్ను ఇంటర్వూ చేసినట్టుగా కాక; ఇంటరాగేట్ చేసినట్టుగా కనబడుతుంది. రంగరాజన్ పరిజ్ఞానాన్ని కించపరిచేందుకు, బ్రాహ్మణ పండితుల కన్నా తనకే ఎక్కువ పాండిత్యం ఉన్నట్టు ప్రదర్శించటానికే వీర్రాఘవరెడ్డి అధిక ప్రాధాన్యమిచ్చినట్టు కనబడుతుంది.
“పండితులమని చెప్పుకొంటూ ఈ మాత్రం విషయాలు మీకు తెలియవా?” అన్నాడంటే అది ఒక్క రంగరాజన్ ను మాత్రమే ఉద్దేశించి, హినపరచినదిగా మనకు కనబడదు. యావత్ బ్రహ్మణపండితుల్ని అవమానపరచినట్టే కనబడుతుంది. ఒక్క రంగరాజన్నే కాక, మొత్తం బ్రహ్మణులందరి వద్ద వీర్రాఘవ రెడ్డి ఇదే పంథాను అవలంభిస్తున్నట్టు కనబడుతోంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ ముట్టడికి ముందు రోజే పశ్చిమగోదావరి జిల్లాలో గల ప్రముఖ హిందూ క్షేత్రమైన వాసవీకన్యకాపరమేశ్వరి దేవస్థానాన్ని సందర్శించినట్లు, ఆ పరిసరాల్లో గల ఒకట్రెండు దేవస్థానాల్లో పనిజేసే అర్చకులను కలసినట్టు వీడియోలు కనబడుతున్నాయి. ఆయా అర్చకుల వద్ద కూడా ఇదే వీర్రాఘవ రెడ్డి తన పాండితీ ప్రకర్షను ప్రదర్శించుట ద్వారా అర్చకులను తక్కువజేసి చూపే ప్రయత్నాలే చేసినట్టు కనబడుతోంది. చివరకు – రంగరాజన్ వద్దనుండి వెళ్ళిపోయే ముందు వీర్రాఘవ రెడ్డి చాలా తీవ్రమైన హెచ్చరికే చేశాడు – “ఫలానా తేదీ నాటికి నేను చెప్పినట్టు చేయకుంటే ఇక నేను కాదు, మరొకరు వస్తారు. అప్పుడు పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి” అని హెచ్చరించి పోయాడు.
ఇతను తన ‘రామరాజ్యం సంస్థ’ సభ్యుల చేత …..”ప్రాణాలు ఇవ్వటానికైనా, ప్రాణాలు తియ్యటానికైనా సిద్ధంగా ఉంటాను” అని ప్రమాణం చేయిస్తూ వాటిని బాహాటంగానే సామాజిక మాధ్యమాలల్లో విడుదల చేయిస్తున్నాడంటే తన వెనుక చాలా పెద్ద తలలే ఉన్నాయన్న సంగతి తాను అన్యాపదేశంగా చెబుతున్నాడు. ‘ఇతనొక వ్యక్తి కాదు, తన వెనుక పెద్ద ‘నిగూఢ శక్తి’యే ఉన్నట్టు’ ప్రత్యక్షంగానే చెప్పాడు. దీన్నిబట్టి – మొత్తం తాను చేస్తున్న క్రతువంతా చాలా ప్రణాళికాబద్ధంగా, వ్యవస్థీకృతంగా నే చేస్తున్నట్టు మనకర్ధమవుతుంది.
నిజంగా మనం సందేహిస్తున్నట్టు ఇవన్నీ హైందవమతంపై దాని లోపలే ఉన్న శక్తులు తమ ఆధిపత్యం కోసం ప్రణాళికాబద్ధంగా చేసే ప్రయత్నాలే అయితే; మున్ముందు చాలా తీవ్రమైన అలజడులు రేగుతాయి. ఈ అలజడులు అరాచక పరిస్థితులకు దారితీస్తాయి. దుష్టశక్తులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొంటాయి. రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. కావున ప్రభుత్వం ఇలాంటి అనారోగ్యకరమైన విపత్కర విషయాలను తీవ్రంగా పరిగణించి, వీటిని మొగ్గలోనే తుంచే ప్రయత్నాలు శీఘ్రమే చేపట్టాలి.
ప్రత్యేకించి – వీర్రాఘవరెడ్డి గూర్చి కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు అతన్ని ఓ మానసిక రోగిగా కొట్టిపారేస్తున్నారు. అతని దురుసు ప్రవర్తన, విడుదలైన ఆడియో, వీడియో రికార్డులు చూస్తున్నప్పుడు అతనిలో ఈ ‘అతి’ కనబడవచ్చు. అయినంత మాత్రాన మానసిక రోగియని తేలిగ్గా తీసుకోలేము. అలా తేలిగ్గా తీసుకొంటే అదే ముసుగులో అలాంటి దుష్టశక్తులు శిక్షాస్మృతి నుండి తేలిగ్గా తప్పించుకొంటాయి. చాలా మంది వ్యక్తులు, వ్యవస్థలు మతం ముసుగులో ఇలాంటి ఉన్మాదపు చేష్టలు ఈ మధ్యకాలంలో చాలా బాహాటంగానే చేస్తున్నారు/యి. అలాంటి సందర్భంలో ఆ లాంటి ఉన్మాదపు సంఘటనలకు పాల్పడ్డవారినందరినీ మానసిక రోగులుగా జమకట్టి ఉపేక్షిస్తే, చివరికి నష్టపోయేది సామాన్య జనాంగమే! కాబట్టి రాజ్యం ఇతని, ఇతని లాంటి వారి వెనుకనున్న శక్తులను పసిగట్టి తగు చర్యలు తీసుకోవలసిన అవసరముంది.
//మారాజ్// 16/02/2025








