Mahaa Daily Exclusive

  లీగ‌ల్లీ బీసీ… ఎమోష‌న‌ల్లీ ఓసీ – పీఎం మోడీ…!

Share

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… మోడీ పుట్టుకతో బీసీ కాదని చేసిన ఇటీవల చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ప్ర‌ధాని మోడీ పుట్టుక‌తో బీసీ కాదని… ఈ దేశంలోని చ‌ట్టాలు, వాటిలో ఉన్న లొసుగుల‌ను ఉప‌యోగించుకొని ఆయ‌న లీగ‌ల్లీ బీసీగా క‌న్వ‌ర్టెడ్ అయ్యార‌ని వ్యాఖ్యానించారు. అది నిజ‌మే కదా. ఆయ‌న వ్యాఖ్యానంలో ఏమాత్రం సత్య‌దూరమైన అంశాలు లేవు. ప్రధాని మోడీ కులంపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ నాయకులు ఎందుకు నానా హైరానా పడుతున్నారో అర్థం కావ‌డం లేదు. తొలుత మోడీ బీసీ కాదని… ఆ త‌ర్వాత‌నే ఆయ‌న‌ కులాన్ని బీసీ ల్లో చేర్చారని మ‌రి కొంత‌మంది బీజేపీ నాయకులే అంగీకరిస్తున్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజ‌య్ ఎందుకు దానిపై రాద్దాంతం చేస్తున్నారు. ఆయ‌న‌కు ఎందుకంత ఉలికిపాటు? ఇంత కాలం మోడీకి బీసీ ముసుగు వేసి ప్రచారం చేసుకున్నారు బీజేపీ నేత‌లు. ఆ ముసుగుతో బీసీల ఓట్ల‌ను కొల్ల‌గొట్టారు. ఆ ముసుగును రేవంత్ రెడ్డి తీయడంతో బీజేపీకి దిక్కుతోచ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఆయ‌న లీగ‌ల్లీ క‌న్వ‌ర్టెడ్డ్ అని మాట్లాడింది రేవంత్ రెడ్డి మాత్ర‌మే కాదు… జాతీయ రాజ‌కీయాల్లో ఈ చ‌ర్చ చాలా కాలంగా ఉన్న‌ది. ఇంతకుముందు ఇదే అంశంపై యూపీ మాజీ సీఎం కుమారి మాయ‌వ‌తి కూడా మాట్లాడారు. మోడీ పుట్టుక‌తో బీసీ కాద‌ని నొక్కి చెప్పారు 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంలో. అప్పుడు ఆమెపై బీజేపీ నేతలు అంతా ఒంటి కాలి మీద లేచారు. ఇదంతా చ‌ర్చ ఎందుకు వ‌స్తుందంటే… ఉదాహ‌ర‌ణ‌కు ఏదైనా కులాన్ని మరేదైనా కులంలో క‌ల‌పాలి అంటే స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయాలి. అందుకోసం స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించే నిపుణుల బృందంతో ఒక క‌మిటీని వేయాలి. ఆ నిపుణుల క‌మిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా…సిఫార్సుల‌పై నిర్ణ‌యం తీసుకుంటారు. కానీ, బీజేపీకి బీసీ కుల గ‌ణ‌న చేయ‌డం అస‌లు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే, మా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టు… న‌రేంద్ర మోడీ లీగల్లీ బీసీ కావొచ్చు…ఎమోష‌న‌ల్లీ ఓసీ అన్న‌ది అక్ష‌రస‌త్యం. తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నో రోజులు తీవ్రంగా శ్ర‌మించి స‌ర్వేను విజ‌య‌వంతం చేసింది. ఆ స‌ర్వే నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిద్దామని పిలుపునిచ్చారు. ఇంకా చెప్పాలంటే, రాష్ట్రంలోని ఈ రోజును సామాజిక స్వాతంత్య్ర దినంగా భావించాలి. ఇత‌ర రాష్ట్రాల‌కు ఇదొక దిక్సూచిగా చెప్ప‌వచ్చు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి తీర్మానాలు చేయడం దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక బ‌ల‌మైన విజ్ఞ‌ప్తి ఇచ్చింది. స్వ‌తంత్ర‌ భారతంలో కులగణన చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది. కులగణన సర్వేకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు రూ.160 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన విష‌యం విదిత‌మే. అధికారికంగా 2024 ఫిబ్రవరి 4వ తేదీన సర్వే ప్రక్రియ ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4వ తేదీని పూర్తి చేసింది. క్షేత్రస్థాయిలో 2024 నవంబర్ 6వ తేదీన సర్వే మొదలుపెట్టి 2024 డిసెంబర్ 25తో పూర్తి చేసింది. మొత్తంగా 3.70 కోట్ల జనాభా గల తెలంగాణలో 3.54 కోట్ల మంది నుంచి శాస్త్రీయ పద్ధతిలో సమాచారం సేకరించింది. సర్వేలో ఎలాంటి గందరగోళం లేకుండా ఒక్కో యూనిట్ 150 ఇళ్లను తీసుకొని ముందుకు వెళ్ళింది. ఇందుకు 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా శ్ర‌మించారు. వీరికి అదనంగా 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా పనిచేయడంతో అందరి కృషితో ఈ స‌ర్వే జ‌రిగింది. తెలంగాణ ప్ర‌జలకిచ్చిన వాగ్దానాలపై ఏమాత్రం వెన‌క్కి వెళ్ళ‌ని కాంగ్రెస్ ఒక్కో హామీని పూర్తి చేస్తుండడం సంతోష‌క‌రం. అయితే, ఈ హామీల‌న్నీ నేర‌వేరుతుంటే ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌, బీజేపీలు త‌మ రాజకీయ ఉనికి కోల్పోతామనే భయంతో వ‌ణికిపోతున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన స‌ర్వేపై విష ప్ర‌చారం చేస్తున్నాయి. ప్ర‌భుత్వం, బీసీ స‌ర్వేపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నాయి. 95 శాతంపైగా సర్వే పూర్తయ్యిందని ప్రభుత్వం లెక్కలతో సహా ప్రకటిస్తున్నా సర్వేను అసంపూర్తిగా ముగించారని విమర్శించడం వారి అజ్ఞానానికి నిదర్శనం. దేశంలో గతంలో ప్రతి పదేళ్లకు జనాభా లెక్కల్ని సేకరించేవారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక జనాభా లెక్కలకు బ్రేక్ పడింది. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో కూడా అప్ప‌టి బ్రిటీష్ ప్ర‌భుత్వం కూడా జ‌నాభా లెక్క‌ల‌ను గ‌ణించ‌డం ఆప‌లేదు. మ‌రి మ‌న మోడీ ప్ర‌భుత్వం ఎందుకు ఆపిందో బండి సంజ‌యులు… కిష‌న్ రెడ్డిలు స‌మాధానం చెప్ప‌డం లేదు. బీజేపీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జ‌నాభా లెక్క‌లు అధికారికంగా బీసీ గ‌ణ‌న చేపట్టాల‌ని డిమాండు చేయడం లేదో చెప్పాలి. ఇదివ‌ర‌కు దేశంలో బ్రిటీష్ వాళ్ళు అయినా… కాంగ్రెస్ పాల‌న‌లో అయినా అదే జ‌రిగింది. కానీ, బీజేపీ మాత్రం అస‌లు కులాల గ‌ణాంకాలు… జ‌నభా గ‌ణాంకాల‌పై ఏమాత్రం దృష్టి సారించడం లేదు. ఇక కేంద్రమంత్రి బండి సంజయ్… చరిత్రలో న‌మోదైన అంశాలు సీఎం రేవంత్ మాట్లాడితే ఎందుకంతా ఆయ‌న‌కు భయమో ఆయ‌నే స‌మాధానం చెప్పాలి. బీసీల పట్ల చిత్తశుద్దితో కులగణ‌న చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేన‌న్న‌ది నేడు యావ‌త్ దేశం చెబుతున్న‌ది. అస‌లు ఈ చ‌ర్చంతా ఎప్పుడు ప్రారంభం అయింది. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చార సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది. త‌న మ్యానిఫెస్టోలో సామాజిక న్యాయ్‌(సోష‌ల్ జ‌స్టిస్‌) చేస్తాన‌ని చెప్పింది. బీసీ రిజ‌ర్వేష‌న్ల మీద సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజ‌ర్వేష‌న్ల క్యాప్ తొల‌గిస్తానని చెప్పింది క‌దా. అందుకోసం కుల‌గ‌ణ‌న చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో బీజేపీ ఒళ్ళు జ‌ల‌ద‌రించిన‌ట్ట‌యింది. అస‌లు ఓబీసీ అంటూ బీజేపీ మోడీని తెర‌పైకి తీసుకొచ్చింది క‌దా… ఓబీసీల‌కు ఆయ‌న వ‌ల్ల ఒన‌గూరిన లాభం ఒక్క‌టైనా ఉన్న‌దా అస‌లు? బీజేపీ నాయ‌కులు ఈ విష‌యంపై ఒక్క మాట ధైర్యంగా చెప్ప‌గ‌లుగుతారా? క్యాపిట‌ల్ డిజిన్వెస్టుమెంట్ పాల‌సీ వ‌ల్ల ప్ర‌భుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. అయితే, అటు ప్ర‌భుత్వ రంగం, ప్ర‌యివేటు రంగంలో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల‌పై మోడీ ఈ ప‌దున్న‌రేండ్ల కాలంలో ఒక ప‌ది సెకండ్లు అయినా ఆలోచ‌న చేసిండా? లేదా పది రూపాయాల మంచి అయినా చేసిండా? మోడీకి ఎన్నిక‌లు అంటే భావోద్వేగ స్పీచులు ఇచ్చుడు త‌ప్పితే… బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల కోసం క‌నీసం ఒక్క ప‌ని అయినా చేసినం అని చెప్పుకునే ప‌రిస్థితి ఉన్న‌దా? ఆయ‌న హ‌యాంలో 10 శాతం ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాడు. అంటే అగ్రకులాల్లో పేద‌ల‌కు క‌ల్పించాడు. అంటే ఆయన ఎమోషనల్లీ ఓసీ అనే కదా దాని అర్థం. ఈబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వమని ఏ క‌మిటీ ఆయ‌న్ను ఈ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించమ‌ని కోరింది మోడీ గారిని. ఆగమేఘాల మీద రిజ‌ర్వేషన్లు క‌ల్పించిన విష‌యం దేశమంతా చేయ‌రా? మ‌రి బీసీల్లో పేద‌ల గురించి ఎవ‌రు ఆలోచిస్తారు? ఆయ‌న ఎందుకు ఆలోచించ‌లేద‌ని ఈ రోజు యావ‌త్ బీసీ స‌మాజం ప్ర‌శ్నిస్తున్న‌ది. భార‌త దేశంలో కులం ఒక ప్ర‌ధాన అంశం. కుల‌మే అనేక అస‌మాన‌త‌ల‌కు కార‌ణం. అయితే, ఏ కులం ఎంత ఉంద‌న్న‌ది లెక్కిస్తే… క‌దా ఆ అస‌మాన‌త‌ల‌ను రూపుమాప‌డం సాధ్యం అయ్యేది. ఆ ప‌ని చేద్దామంటే బీజేపీ నుంచి ఏమాత్రం స్పంద‌న రాకుండా కేవ‌లం ఉప‌రిత‌ల అంశాల‌కి మాత్ర‌మే ప‌రిమితం అవుతుండ‌టం చూస్తుంటే… బీసీలు, బీసీ అభ్యున్న‌తిపై వారి చిత్త‌శుద్ధి ఏంటో అంద‌రికీ అర్థం అవుతున్న‌ది. ఇక మన బీజేపీ పార్టీ ఇటీవల జరిగిన పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా వారు విడుదల చేసి మేనిఫెస్టోలో కనీసం బీసీ అన్న పదమే లేదు. ఇంతకంటే వివక్ష మరొకటి ఉంటుందా?
బిజెపి మ్యానిఫెస్టోలో బిసిల ప్రస్తావనే లేదు- అన్న ఈ విషయాన్ని బీసీ ఉద్యమ నేత ఆర్​ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్​ పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా చెప్పారు. ప్రధాని మోడీయే స్వయంగా బీసీగా డబ్బా కొట్టుకున్నా…. బీసీల గురించి బీజేపీ మేనిఫెస్టోలో ఒక్క మాట లేదంటే… ఆ పార్టీకి బీసీల అభ్యున్నతిపై చిత్తశుద్ధి ఏంటో తెలుసుకోవచ్చు. 70 కోట్లు ఉన్న బీసీల గురించి కనీస ప్రస్తావన లేకపోవడంపై మనం ప్రశ్నించాలి. వాస్తవానికి ఈ రోజు రేవంత్​ రెడ్డి అదే ప్రశ్నించాడు. మోడీయే దొంగ బీసీ. అందుకే, ఆయన పార్టీ బీజేపీ బీసీలకు ఏం చేయడం లేదు. చేయదు కూడా అని చెప్పేశారు రేవంత్​. ఇక కొత్త రాష్ట్రం వస్తే సబ్బండవర్గాల బతుకులు బాగుపడతాయని… సామాజిక న్యాయం జరుగుతుందని తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ సమయంలో చెప్తుండేవారు. తెలంగాణ వచ్చి పదేండ్లయింది. అయితే, ఈ పదేండ్లలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్​ కులపోళ్ళు తప్ప ఏ బీసీలు బాగుపడలేదు. బీజేపీ, బీఆర్​ఎస్ వల్ల​ బడుగుల జీవితాల్లో ఎటువంటి మార్పూ రాలేదు అనేది నగ్నసత్యం. పదేండ్లలో కాలంలో తన ప్రభుత్వం నుంచి ఒక దళిత బిడ్డ తాటికొండ రాజయ్య, ఒక బీసీ బిడ్డ ఈటెల రాజేందర్​ ను అత్యంత అవమానకర రీతిలో తన క్యాబినెట్​ నుంచి తీసివేసిన దుర్మార్గపు పాలన చేసిండు కేసీఆర్​. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేసిండ్రు. కాంగ్రెస్​ పార్టీ మాత్రం కామారెడ్డి పట్టణ కేంద్రంలో బీసీ డిక్లరేషన్​ విడుదల చేసి… క్రమంగా దాన్ని అమలు చేసేందుకు ముందుకు కదులుతున్నది. అన్ని సేవా, వృత్తి కులాలకు న్యాయం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కాంగ్రెస్​ మాత్రం బీసీలకు ఉద్యోగాల్లో వారి శాతం ఎంతనో అంతే శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. అత్యంత కీలకమైన కుల గణన చేస్తామని అప్పుడు చెప్పింది…. ఇప్పుడు చేసి చూపింది. మా కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన కుల గణన యావత్​ దేశానికే ఆదర్శం. ఇదే విషయంపై పక్క రాష్ట్రాలు కూడా చర్చ చేసుకుంటున్నాయి. ఇదంతా అందరికీ తెలిసిందే. కమ్మరి, కుమ్మరి, మంగలి, సాకలి సబ్బంబడవర్ణాలు, సర్వ జనుల కోసం సమరం సాగేందుకు…, వారి సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నది. ఆ విధంగానే అడుగులు వేస్తున్నది. బ్రిటీషర్స్​ తర్వాత… వేర్వేరుగా ఉన్న వేలాది కులాలను జనగణన చేసి గుర్తించి కాంగ్రెస్​ పార్టీయే. బీజేపీ మూడుసార్లు గెలిస్తే ఈ దేశంలో… ఒక్కసారి కూడా జనగణన చేయలేదు. కుల గణన అసలే చేయలేదు. ఇంతకంటే బీసీలకు ద్రోహం ఉంటుందా? ఎన్నో పోరాటాలు, మ‌రెన్నో బ‌లిదానాల త‌ర్వాత దేశంలో 28వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఆయ‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలినాళ్ళ‌లోనే 2015లోనే కేవ‌లం ఒక‌టే రోజు హడావుడి స‌ర్వే చేస్తూ నాట‌కాలు చేసింది. ఏదో వేరే రాజ్యంతో యుద్ధం చేస్తున్న‌ట్టు ఆగ‌మేఘాల మీద సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. మ‌రి ఆ లెక్క‌ల‌ను అధికారికంగా కేసీఆర్ ప్ర‌భుత్వం బయటపెట్టలేదు. తమ రాజకీయ స్వార్థానికి ఆ సర్వే నివేదికను ఉపయోగించుకున్న బీఆర్ఎస్ అగ్ర‌నేత‌లు… ఇప్పుడు తప్పుడు లెక్కలతో సోషల్ మీడియాలో సమగ్ర కుటుంబ సర్వే నివేదిక అంటూ వైరల్ చేయడం వారి క‌ప‌ట రాజ‌కీయ వైఖ‌రికి నిలువుట‌ద్దం. ఇక ఇంకో కీల‌క విష‌యం కూడా మ‌న ఈ సంద‌ర్భంగా చ‌ర్చ చేసుకోవ‌లి. గతంలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించింది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే క‌దా. ఇప్పుడు కాంగ్రెస్ 42 శాతం టికెట్లు బీసీలకు ఇస్తామన్నా విమర్శించడంలో వారికి ఏమైనా బీసీల అభ్యున్న‌తిపై చిత్త‌శుద్ధి ఉందా అన్న విష‌యం గుర్తెర‌గాలి.

– స‌త్తు మ‌ల్లేష్‌, గ్రంథాల‌య క‌మిటీ ఛైర్మ‌న్‌, క‌రీంన‌గ‌ర్‌.