Mahaa Daily Exclusive

  మెట్రో @ 24 స్టేషన్లు ప్రకటించిన మెట్రోరైల్ యాజమాన్యం…!

Share

మెట్రో ఇక హాయ్ హాయ్ అంటూ హైదరాబాద్ వాసులకు మరింత సౌకర్యంగా మారబోతోంది. నాగోల్ టు ఎయిర్ పోర్ట్ మొత్తం 24 స్టేషన్లను ధనాధన్ ప్రకటించేసింది. ఇవి అంతే వేగంగా పూర్తయితే హైదరాబాద్ లో జర్నీ మరింత హాయిగా ఉంటుంది. ట్రాఫిక్ కష్టాలు తీరి మెట్రో వరంగా మారుతుంది. హైదరాబాద్ మహానగరంలో మెట్రోరైలును విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో యాజయాన్యం దీనిపై అధ్యయనం చేసి కొత్త స్టేషన్లు ఫైనల్ చేసింది. మొదటి దశలో 69కిలోమీటర్ల మార్గంలో చేపట్టిన ప్రభుత్వం రెండో దశలో 161.4కిలోమీటర్ల మార్గంలో చేపట్టాలని నిర్ణయించింది. రెండో దశలో నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ వరకు 36.8కిలోమీటర్ల మార్గంలో 24స్టేషన్లను గుర్తించింది. ఈ స్టేషన్ల వివరాలను హైదరాబాద్ మెట్రోరైలు యాజమాన్యం ఎక్స్ ద్వారా శనివారం తెలిపింది. నగరానికి నలువైపుల మెట్రో రైలు మార్గం విస్తరించనుంది. మొదటి దశలో 69కిలోమీటర్ల మెట్రోరైలు ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. రెండో దశలో ఎయిర్ పోర్ట్ వరకు విస్తరణే లక్ష్యంగా 76.4కిలోమీటర్ల మార్గంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్ లను కూడా కేంద్రానికి పంపించారు. ఇక ఫోర్త్ సిటీ 40కిలోమీటర్లు, నార్త్ సిటీ 45కిలోమీటర్ల మార్గంలో మెట్రోరైలును విస్తరించాలని నిర్ణయించారు. మొత్తం 230.4కిలోమీటర్ల మార్గంతో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రోరైలు రెండో స్థానంలో నిలవనుంది.

నగరానికి నలువైపులా..

నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు మార్గంలో 24 స్టేషన్లను గుర్తించారు. వాటికి సంబంధించిన వివరాలను ఎక్స్ ద్వారా వెల్లడించారు. నాగోల్, నాగోల్ ఎక్స్ రోడ్డు, అల్కాపురి, కామినేని హస్పిటల్, ఎల్బీనగర్(ఎయిర్ పోర్ట్), బైరమాల్ గుడ, మైత్రీనగర్, కర్మాన్ ఘాట్, చంపాపేట్, ఓవైసీ హస్పిటల్, డీఆర్డీఓ కంచాన్ బాగ్, బాలాపూర్ రోడ్డు, చాంద్రాయన్ గుట్ట, బండ్లగుడ రోడ్, మైలార్ దేవ్ పల్లి, కాటేదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, గగన్ పహాడ్, శాతంరాయి, సిద్దాంతి, శంషాబాద్, కార్గో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉన్నాయి.

తొలిదశకు అనుసంధానం

మొదటి దశ కారిడార్‌-1లోని ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ మెట్రో మార్గంతో (29 కి.మీ) అనుసంధానం చేస్తూ మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కి.మీ దూరం, ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు 7.1 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు.దీంతో ఈ కారిడార్ 49.5కిలోమీటర్లకు పెరగనుంది. కారిడార్‌-2లో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ ఉన్న ఈ మెట్రో మార్గానికి సైతం రెండు వైపులా కొత్తగా అనుసంధానం చేస్తూ మెట్రో మార్గాలను విస్తరించనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ, జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట వరకు 22 కి.మీ మేర మొత్తం 40.5కి.మీ కానుంది.

రాయదుర్గం టు ఎయిర్ పోర్టు వయా నాగోల్ 56.4కి.మీ

కారిడార్‌-3లో నాగోల్‌-రాయదుర్గం మెట్రో మార్గం (29 కి.మీ)లో నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 36.4 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు.దీంతో మార్గం 56.4కి.మీలకు పెరగనుంది. రాయదుర్గం మెట్రోస్టేషన్‌ నుంచి కోకాపేట నియోపోలీస్‌ లేఅవుట్‌ వరకు 11.6 కి.మీ మేర నిర్మిస్తారు. ఇదే కారిడార్‌లో ప్యారడైజ్‌ మెట్రోస్టేషన్‌ నుంచి బోయిన్‌పల్లి, సుచిత్ర మీదుగా నాగ్‌పూర్‌ జాతీయ రహదారి వెంబడి మేడ్చల్‌ వరకు మరో 23 కి.మీ మేర కొత్తగా మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు.

ఫోర్త్ సిటీ రూటు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌ నుంచి ఫోర్త్‌ సిటీ వరకు నిర్మించే మెట్రో మార్గాన్ని ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా తుక్కుగూడ, కొంగరకలాన్‌, రంగారెడ్డి కలెక్టరేట్‌ నుంచి మీర్‌ఖాన్‌పేట వద్ద ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీ వరకు 40 కి.మీ మేర కొత్తగా మెట్రో మార్గాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలపై యాజమాన్యానికి ఆదేశాలిచ్చారు.

మెట్రో రూట్స్

కారిడార్‌-1 (ఎల్‌బీనగర్‌-మియాపూర్‌) – 29 కి.మీ
కారిడార్‌-2 (జేబీఎస్‌-ఎంజీబీఎస్‌) – 11 కి.మీ
కారిడార్‌-3 (నాగోల్‌ – రాయదుర్గం) – 29 కి.మీ
ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట – 7.5 కి.మీ
నాగోల్‌-ఎల్‌బీనగర్‌-చాంద్రాయణగుట్ట- ఆరాంఘర్‌-శంషాబాద్‌ – 36.4 కి.మీ
రాయదుర్గం – కోకాపేట నియోపోలిస్‌ – 11.6 కి.మీ
మియాపూర్‌ – బీహెచ్‌ఈఎల్‌- పటాన్‌చెరు – 13.4 కి.మీ
ఎల్‌బీనగర్‌ – వనస్థలిపురం- హయత్‌నగర్‌ – 7.1 కి.మీ
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు – ఓఆర్‌ఆర్‌ మీదుగా కొంగరకలాన్‌- ఫోర్త్‌ సిటీ – 40 కి.మీ
ప్యారడైజ్‌- మేడ్చల్‌ – 23 కి.మీ
జేబీఎస్‌ – శామీర్‌పేట – 22 కి.మీ