మోగిన మరో ఎన్నికల నగారా
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్
తెలంగాణలో ఐదు, ఏపీలో ఐదు ఖాళీలు
మార్చి 3న నోటిఫికేషన్..10 వరకు నామినేషన్లు
మార్చి 20న పోలింగ్..
సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ కు 4, బిఆర్ఎస్ కు 1
ఆశావహులు 20 మందికి పైనే
హైదరాబాద్, మహా : తెలంగాణలో మరో ఎన్నికల నగరా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో మెుత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 10 వరకు నామినేషన్లకు తుది గడువు ఇచ్చారు. మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతోన్న హసన్ మీర్జా, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పదవీ కాలం మార్చి 29న ముగుస్తుండగా ఖాళీ కానున్న ఈ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రంలో మెుత్తం ఎమ్మెల్యేల సంఖ్య 119 కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 64 మంది విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో 10 మంది కాంగ్రెస్ గూటికి చేరారు. మెుత్తం 5 స్థానాలకు గాను సంఖ్యా పరంగా కాంగ్రెస్ నాలుగు స్థానాలు, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కించుకునే అవకాశాలున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ విప్ జారీ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్- కరీంనగర్ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటుగా నల్గొండ- ఖమ్మం- వరంగల్ టీచర్ స్థానానికి ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండగా కాంగ్రెస్, బీజేపీ, పలువురు స్వతంత్య్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నిక ముగియగానే మార్చి 3న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో రానున్న నెల రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగనుంది.
సంక్షిప్తంగా
– ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఖాళీలకు షెడ్యూల్
– మార్చి 3న నోటిఫికేషన్ విడుదల
– మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్
– ఏపీలో రిటైర్ కానున్న జంగా కృష్ణమూర్తి, యనమల, పరుచూరి అశోక్‌బాబు, తిరుమలనాయుడు, రామారావు
– తెలంగాణలో రిటైర్ కానున్న మహమూద్ అలీ, సత్యవతి
శేరి సుభాష్‌రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుస్సేన్
– ఈ నెల 29తో ముగియనున్న ఎమ్మెల్సీ పదవీకాలం
– మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన
– నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు
సామాజిక వర్గాలవారీగా ఇచ్చే ఛాన్స్
రెడ్డి సామాజిక వర్గం నుండి జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి
బీసీ సామాజిక వర్గం నుండి చరణ్ కౌశిక్ యాదవ్,అంజన్ కుమార్ యాదవ్,వజ్రేష్ యాదవ్
ముదిరాజ్ సామాజిక వర్గం నుండి రేసులో సునీతారావు,నీలం మధు
కమ్మ సామాజిక వర్గం నుండి కుసుమ కుమార్
మైనారిటీ సామాజిక వర్గం నుండి ,షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, ఫహిం ఖురేషి,అజరుద్దీన్, అజ్మతుల్లా
ఎస్సి సామాజిక వర్గం నుండి అద్దంకి దయాకర్, సంపత్ కుమార్
ఎస్టీ సామాజిక వర్గం నుండి బెల్లయ్య నాయక్,మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పోటీ








