Mahaa Daily Exclusive

  క్లిష్ట సమయంలోనూ రాజకీయ రాద్దాంతమా బాధితులకు భరోసా ఇవ్వకుండా ధర్నాలా హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్…!

Share

ఎస్ఎల్ బీసీ టన్నల్ వద్ద బీఆర్ఎస్ నేతలు కావాలని రాద్దాంతం చేస్తున్నారని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మండిపడ్డారు. హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేశారు.. కానీ కనీస ఇంగితం లేకుండా మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను వేసుకోని ఎస్ఎల్ బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లి ఆందోళన చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతీది రాజకీయం చేయడం, తద్వారా రాజకీయ లబ్ధి కోసం తహతహలాడటం బీఆర్స్ నేతలకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్ లు రేయింబవళ్ళు కష్టపడుతుంటే హరీష్ రావు బృందం అక్కడకు వెళ్లి హడావిడి చేసి, ఫొటోలకు పోజులు ఇస్తూ వారి పనికి ఆటంకం కలిగించకూడదన్న కనీస జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నిర్మాణ దశలో ఏ ఒక్క మీడియా సంస్థనైనా అక్కడికి అనుమతి ఇచ్చారా? కిలో మీటర్ల దూరంలో ఆపేసిన చరిత్ర మీది, దీనిపై చర్చకు సిద్ధమా అంటూ హరీష్ రావుకు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.

దేశంలోని అన్ని రంగాల రెస్క్యూ టీమ్స్‌తో యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం పని చేయిస్తుంటే ఏమి చేయాలో అర్ధం కాక చేష్టలుడిగి కోడి గుడ్డుపై ఈకలు పీకే పని హరీష్ రావు పెట్టుకున్నాడని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే సమన్వయం లేదని మాట్లాడుతున్నారని, మీరు ఏ సమన్వయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంత సమన్వయంతో నిర్మించిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయిందో హరీష్ రావు చెప్పగలడా ? దానిపై చర్చకు సిద్ధమా? అంటూ నిలదీశారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంలో ప్రాణాలు పోలేదా? … బాహుబలి మోటార్లు వరద నీటిలో ఎందుకు మునిగాయో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఏది పడితే అది మాట్లాడటం హరీష్ రావుకు అలవాటు అయిందని మండిపడ్డారు. టన్నెల్ వెళ్లి హడావిడి చేసి పత్రికలకు ఫోజు ఇవ్వడం కాదని హితవు పలికారు. సాగునీటి మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న హరీష్ రావు టన్నల్ లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలన్న అంశంపై తనకున్న అనుభవాన్ని ప్రభుత్వంతో పంచుకోకుండా రాజకీయ లభ్ధికోసం పాకులాడటం దుర్మార్గమన్నారు.