ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాల్సిందేనని, ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం కార్మిక శాఖపై సమీక్షించిన సీఎం రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా(ఏటీసీ) అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని, ఏటీసీలలో అవసరమైన సిబ్బంది ఇతర వివరాలను అధికారులు సీఎంకు అందించారు. సిబ్బంది నియామకంపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఏటీసీల ఏర్పాటుకు అవసరమైన నిధులు ప్రభుత్వం వెంటనే అందించేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్స్ యాక్ట్ పై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్‌రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.








