పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలు ఏర్పాటుచేసి, సమన్వయం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్దామని ఎఐసిసి ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై బయట చర్చ పెట్టొద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. అంతర్గత విషయాలపై బయట చర్చ పెట్టిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ అనుబంధ సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. నివేదికలు ఇవ్వకపోయినా వారి పనితీరు ఏంటనేది తమకు తెలుస్తుందని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నది ఎవరు..? పనిచేసినట్టు యాక్టింగ్ చేస్తున్నది ఎవరనేది కూడా తెలుస్తుందంటూ చురకలు అంటించారు. పార్టీ కోసం సమయం ఇవ్వండి.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు. తన పని తీరు నచ్చకపోయినా.. రాహుల్, సోనియాకు ఫిర్యాదు చేయొచ్చు అన్నారు. తన దృష్టిలో పడాల్సిన అవసరం లేదంటూనే.. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయాలని నేతలకు సూచిస్తున్నారు. బుధవారం ఉదయం పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో గాంధీభవన్ లో మాట్లాడారు. తర్వాత ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావిస్తూనే పలువురికి చురకలు అంటించారు. త్వరలోనే కమిటీల ఎంపిక పూర్తిచేస్తామన్నారు.
మూడు గ్రూపులుగా నేతలు:
రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత లీడర్లతో ఓవర్ లోడ్ అయింది. చేతిలో చిక్కనంత మంది నేతలు ఉండటంతో సొంత నేతలే ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఇక ఈ పరిస్థితికి చెక్ పెట్టకుండా పార్టీకి నష్టం తప్పదని గ్రహించిన అధిష్టానం పార్టీ నేతలను మూడు గ్రూపులుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్లు ఒక గ్రూప్ గా, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను మరొక గ్రూప్ గా, పార్టీ అధికారంలోకి వచ్చాకా కండువా కప్పుకున్న వారిని మరో గ్రూప్ గా విభజించాలని మీనాక్షి నటరాజన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ కేటగిరిల వారీగా ప్రధాన్యత ఇవ్వడం ద్వారా నేతలకు పార్టీకి మధ్య దూరం తగ్గించవచ్చనేది మీనాక్షి నటరాజన్ కొత్త ఫార్ములాను రూపొందించే యోచనలో ఉంది.








