Mahaa Daily Exclusive

  ఒక్క రూపాయీ ఇంటికి తీసుకుపోనూ నాకు సంపాదంచాలనే కోరికా లేదు రాష్ట్రాభివృద్ధే నా ధ్యేయం – సీఎంరేవంత్ రెడ్డి

Share

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1532 మందికి సీఎం రేవంత్ చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగాలు చేపడుతున్నవారికి అభినందనలు తెలిపారు. కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడల్లో కూడా యువత రాణించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగ సమస్య కూడా ఒక ప్రధాన కారణమన్నారు. గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలను ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేలకుపైగా నియామకాలు చేపట్టామని సీఎం తెలిపారు. గతంలో సంతలో సరుకుల్లా ప్రశ్నపత్రాలు అమ్మారని విమర్శించారు. తనతో పాటు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఈ స్థాయికి వచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందని తమ ప్రభుత్వం వచ్చాక విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్యా శాఖకు రూ. 21,650 కోట్లు కేటాయించామని రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వంలో కాళేశ్వరం కడితే అది కూలిపోయి కూలేశ్వరం అయ్యిందంటూ సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఎస్ఎల్‌బీసీ నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను ఎవరి పిల్లలో ప్రాణాలు త్యాగాలు చేస్తేనో, అవాస్తలు చెప్పి అధికారంలోకి రాలేదన్నారు. తాను ఒక్క రూపాయీ ఇంటికి తీసుకుపోనని స్పష్టం చేశారు. తనకు సంపాదించాలనే కోరిక లేదన్నారు. తన జీతం కూడా రాష్ట్రం కోసమే ఖర్చు పెడతానని అన్నారు. వచ్చే 20 ఏళ్లు తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేస్తానని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా నైపుణ్యత కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్య పూర్తయిన విద్యార్థులకు వెంటనే వివిధ రంగాల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. విద్యతోపాటు క్రీడలకు కూడా విద్యార్థులు ప్రాధాన్యత ఇచ్చి ఆయా రంగాల్లో రాణించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 2036లో భారతదేశంలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఆ వేడుకలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహించేందుకు హైదరాబాద్‌కు అన్ని అర్హతలున్నాయని సీఎం చెప్పారు.