మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గవర్నర్ ప్రసంగం సందర్భంగా బుధవారం అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ దాదాపు అర గంట పాటు భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. కొంతకాలంగా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ గంట ముందే అసెంబ్లీకి రావడం గమనార్హం. బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చివరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి హాజరైన సంగతి తెలిసిందే. మళ్లీ అప్పటి నుంచి అసెంబ్లీకి హాజరుకాకపోవడం గమనార్హం. తాజాగా ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు కేసీఆర్ సభకు వస్తారా లేక మరోసారి బడ్జెట్ ప్రసంగం రోజు వస్తారా అన్న విషయంలో స్ఫష్టత రావాల్సి ఉంది.








