Mahaa Daily Exclusive

  ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన బడ్జెట్ – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Share

అట్టహాసంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన జరిగిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అగాథంలోకి నెట్టేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్టు చేసిందని వ్యాఖ్యానించారు. గతేడాది బడ్జెట్‌ పెట్టినప్పుడు తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారని, 15 నెలలు పాలించిన తర్వాత కూడా ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా కేటాయింపులు, ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందన్నారు. అంకెల గారడీ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన బడ్జెట్ ఇది అఇని కిషన్ రెడ్డి ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలపై ప్రజలు ఆశలు వదులుకోవాలని బడ్జెట్ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయం, రాబడిపై కనీస అవగాహన లేకుండా అంచనాలు రూపొందించారని’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. దున్నపోతుకు పాలు పిండినట్లుంది రాష్ట్ర బడ్జెట్ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంచనాలు భారీ, కేటాయింపులు, అమల్లో మాత్రం సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఇదీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని అన్నారు. అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి కాంగ్రెస్ ప్రబుత్వం మోసం చేసిందన్నారు. 2024-25 బడ్జెట్ లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపించారు. కానీ సవరించిన అంచనాల్లో.. రూ.5వేల కోట్లు తగ్గించి.. రూ.53,665 కోట్లుగా వెల్లడించారని పేర్కొంటూ దాదాపు 8.5% శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయని, దీనికి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. 2025-26 సంవత్సరానికి గానూ రూ. 59,704 కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందులో లెక్కలు పెంచి ఎంత రాశారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను మించి అత్యుత్సాహంతో లెక్కలను ప్రకటించిందని, రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని పెంచి దాని ద్వారా ఆదాయం పెంచుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టడం దురదృష్టకరమన్నారు. 2024-25లో ఎక్సైజ్ టాక్స్ ద్వారా రూ. 25,617 కోట్ల అంచనాలు ప్రకటించిన సర్కారుకు.. ఈసారి బడ్జెట్‌లో.. రూ.27,623 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా రావొచ్చని అంచనా వేస్తోందని వివరించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేసి ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచన స్పష్టంగా కనబడుతోందన్నారు. ఇలా ప్రతిచోటా అంచనాలను పెంచి రాష్ట్ర ఆదాయాన్ని దాదాపు 12% ఎక్కువగా చూపిస్తున్నారన్నారు. రైతులను, యువతను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ఉద్యోగులను ఇలా ప్రతి వర్గాన్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారుని, నిరుద్యోగ భృతి గురించి మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా పేరుకైనా లేదన్నారు. గత బడ్జెట్‌లో 60 వేల కోట్ల అప్పులు తీసుకుంటామని చెప్పి లక్షన్నర కోట్ల అప్పులు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు 74 వేల కోట్లు అని చెప్పారు. అంటే ఇది 2.25 లక్షల కోట్లు దాటిపోతుందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తలదన్నేలా.. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. విద్యారంగానికి 2025-26 బడ్జెట్‌లో కేవలం.. 7.5% నిధులే కేటాయించారంటూ ఎన్నికల మేనిఫెస్టోలో.. 15% నిధులు విద్యారంగానికి ఖర్చుచేస్తామనే హామీని అసెంబ్లీ సాక్షిగా తుంగలో తొక్కారని మండిపడ్డారు.