Mahaa Daily Exclusive

  మహిళాసంఘాలకు రూ.23వేల కోట్ల రుణాలు స్త్రీనిధికి సిబ్బందిని నియమిస్తాం – మంత్రి సీతక్క

Share

మహిళా సంఘాలు అంటే స్వయం ఉపాధి సంఘాలు కాదని, పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళా సంఘాలు ఎదిగాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ది శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రతి సంవత్సరం స్త్రీ నిధి సంస్థ ఏ గ్రేడ్ సాధించిందని, మహిళలు గొప్ప ఆర్థిక వేత్తలు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో జరిగిన స్త్రీ నిధి 12వ సర్వసభ్య సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళా సంఘాలకు 3500 కోట్ల వడ్డీలను ఎగ్గొట్టిందని, తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలను చెల్లిస్తున్నామన్నారు. గతంలో పావలా వడ్డీ గత ప్రభుత్వం వసూలు చేస్తే.. మేము ఇష్టంగానే వేలకోట్ల రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికీ మహిళా సంఘాలకు 23 వేల కోట్ల బ్యాంకు రుణాలను ఇప్పించామన్నారు. స్త్రీనిధి బ్యాంకుకు రూ.800 కోట్ల సేవింగ్స్, రూ. 5200 కోట్ల మూలనిధి ఉందన్నారు. మహిళలకు మీకు మీరే ఒక బ్యాంకు ఏర్పాటు చేసుకుని అతి తక్కువ వడ్డీలకే రుణాలు ఇస్తున్నారని తెలిపారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి మహిళలను కాపాడేందుకు 2011 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్త్రీ నిధి సహకార సంస్థను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఒకప్పుడు మహిళలకు రూపాయి అప్పు కూడా పుట్టకపోయేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వానికి రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. ఆశ, ఆకాంక్ష, ఆత్మవిశ్వాసం మహిళలకు వుందని, అదే మహిళా శక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు. ఆకాశాన్ని చిల్చుకుని సునీత విలియమ్స్ అంతరిక్షానికి వెళ్లి వచ్చింది..మీకు అవకాశాలు ఇస్తే అవకాశాన్ని చేర్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారన్నారు. ఇప్పటికే రెండున్నర లక్షల చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నాయని, మహిళా సంఘాల సభ్యుల నైపుణ్యాన్ని పెంచేలా అత్యున్నత సంస్థలతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు కోసం ఇక్రిసాతో ఒప్పందాలు చేసుకుంటున్నామని, స్థానికంగా లభ్యమయ్యే వనరుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళా ప్రగతి సమాజ ప్రగతికి కొలమానం అన్న అంబేద్కర్ వ్యాఖ్యలను గుర్తు చేశారు.

ఆత్మవిశ్వాసంతో అడుగేయండి

మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం పెంచేందుకు కోట్లు వెచ్చించి శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజారు ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి జిల్లాలో మహిళా శక్తి బజార్లను ఏర్పాటు చేసేందుకు ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల విజయాలు చూసి గర్వపడుతున్నానని, మహిళా స్వయం సహాయక సంఘాల విజయాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. అది మరింత మంది మహిళలకు ధైర్యాన్నిస్తోందన్నారు. మహిళలు సీఈఓ లు మేనేజర్లుగా ఉన్న కంపెనీలు లాభాల్లో దూసుకుపోతున్నాయని, ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో అడుగువేస్తే విజయం సొంతమవుతుందన్నారు. అందుకు నిదర్శనమే స్త్రీ నిధి బ్యాంక్ అని అభిప్రాయపడ్డారు. మహిళా సంఘాలే ఒక మహిళా బ్యాంకును నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. ఎన్నో వర్గాలకు ఇది స్ఫూర్తిదాయకమని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 4600 కోట్ల సబ్సిడీ రుణాలను ఇస్తున్నామని తెలిపారు. 50 వేల నుంచి రెండు లక్షల వరకు రాయితీ ఇస్తున్నామన్నారు. స్త్రీ నిధి కి అవసరం అయిన సిబ్బంది ని నియమిస్తామని, ప్రతి మహిళా ఎస్ హెచ్ జీ లో ఉండాలని సూచించారు. స్త్రీ నిధి బ్యాంక్ పై సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ రవీందర్ రావు రూపొందించిన పాటను మంత్రి ఆవిష్కరించారు.