వైసీపీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ దృష్టి సారించారు. యువతలో ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్దార్ధ రెడ్డికి వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి వైసీపీ హయాంలో ఉన్న సమయంలోనూ యాక్టివ్ గా వ్యవహరించారు. అప్పట్లో శాప్ ఛైర్మన్ గా పని చేసారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాం లో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా లో అవినీతి చోటు చేసుకుందని .. విచారణ చేస్తామని చెప్పు కొచ్చారు. దీని పైన సిద్దార్ధ రెడ్డి ఘాటుగా స్పందించారు. కర్నూలు జిల్లాతో పాటు బైరెడ్డి సిద్దార్ధరెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా యువతలో ఫాలోయింగ్ ఉండడంతో పాటు కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనే మొండితనం ఉందని జగన్ గుర్తించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తూ.. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. జగన్ నాయకత్వం గురించి వివరిస్తున్నారు. యువత లో బైరెడ్డికి ఉన్న పట్టు చూసిన తరువాత పార్టీ యువజన విభాగం పగ్గాలు అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారు. 2024 ఎన్నికల వేళ కూటమి అధికారంలోకి రావటానికి నాడు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పైన పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. దీంతో.. కూటమి ఈ హామీల అమలు విషయంలో నిర్ణయాలకు అనుగుణంగా స్పందించే బాధ్యతను బైరెడ్డికి జగన్ అప్పగించారు. అదే విధంగా మంచి వాగ్దాటి ఉండటంతో అన్ని జిల్లాల్లో పార్టీ యువజన కేడర్ తో మమేకం అవుతూ.. పార్టీ బలోపేతం దిశగా పని చేయాలని జగన్ ఇప్పటికే నిర్దేశించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం బైరెడ్డికి దక్కడంతో.. ఇక రాజకీయం ఆసక్తిగా మారనుంది. జగన్ సమర్ధులకు అవకాశమిస్తే మళ్ళీ తిరిగి పార్టీకి పూర్వవైభవం దక్కుతుందని క్యాడర్ అంటున్నారు.








