: ఇటీవల కాలంలో సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా? అనేవి ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. సగం మంది జనాలు అతిగా ఇలాంటి కంటెంట్‌నే చూస్తున్నారు. సోషల్ మీడియా యాప్స్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, స్నాప్‌చాట్ వంటి వాటిల్లో ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి. మీకు ఈ ప్రొడెక్ట్ నచ్చితే వెంటనే కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి అని రాస్తున్నారు. దానిపై క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మొత్తం దోచుకోవడమో లేకపోతే బెదిరించడమో చేస్తున్నారు. ఈ మధ్య తమ ఉత్పత్తులకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అది కూడా ఇంటి వద్ద నుంచే డబ్బులు సంపాదించవచ్చని చెబుతున్నారు. వీటిపట్ల మహిళలు, పిల్లలు, ఉద్యోగం చేయలేని వాళ్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వారి ఆసరాను అవకాశంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇలా తాజాగా ఆదిలాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏకంగా రూ.16.79 లక్షలు పోగొట్టుకున్నాడు. కాస్త ఆలస్యంగా గుర్తించిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది.
ఆదిలాబాద్ వన్‌టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి తన టెలిగ్రాంలో ఒక సందేశం వచ్చింది. అందులో వచ్చిన సందేశం మేరకు మొదట వారి ఉత్పత్తులకు లైకులు కొట్టాడు. దీంతో అతడి ఖాతాకు మొదట రూ.10 వేల నగదు వచ్చి చేరింది. దీంతో ఆ వ్యక్తి ఆనందించాడు. ఈసారి పెట్టుబడి రెండింతలు, మూడింతలు లాభం వస్తాయంటూ సందేశాలు వచ్చాయి. దీంతో అవి నిజమేనని నమ్మి ఈ నెల 24 నుంచి 26 వరకు విడతల వారీగా 13 సార్లు నగదును జమ చేస్తూ వెళ్లాడు. ఇలా జమ చేసిన తర్వాత కూడా అతడికి అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి, వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పోలీసుల సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉంటే సైబర్ నేరాలు తగ్గుతాయని సూచించారు.








