తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులతో కలిసి ఆదివారం రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్తో చర్చించారు. కేబినెట్ విస్తరణపైనే సీఎం రేవంత్ గవర్నర్తో చర్చలు జరిపినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో గవర్నర్తో సీఎం సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఉగాది తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని గత కొన్ని రోజులుగా రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ కావడం ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముహూర్తం ప్రకారం కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని, ఏప్రిల్ 2వ తేదీ రాత్రి లేదా ఏప్రిల్ 3 ఉదయం ఢిల్లీ నుండి మంత్రివర్గ జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
జిల్లాలు.. సామాజిక సమీకరణలు
సామాజిక సమీకరణాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ జిల్లాలకు కేబినెట్లో అవకాశం కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 15 నెలలుగా కేబినెట్ విస్తరణ పెండింగ్లో ఉండటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విస్తరణ చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం, హైకమాండ్ సూత్రపాయంగా నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో పార్టీ పెద్దలతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యి మంత్రి వర్గ విస్తరణపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనాపరంగా స్వేచ్చనిచ్చేలా కేబినెట్ మార్పులుచేర్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆ నలుగురే ఫైనల్
మంత్రివర్గంలోకి నలుగురిని తీసుకోవాలని అధిష్టానం డిసైడ్ అయింది. ముఖ్యమంత్రి అభిప్రాయానికి అనుగుణంగానే.. ఆయన జట్టులో సభ్యులు చేరనున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరూ మంత్రి వర్గంలో లేరు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి దాదాపుగా మంత్రి పదవి ఖరారైపోయిందనే చర్చ ఢిల్లీ సర్కిల్స్ లో ఉంది. నల్లగొండ నుండి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కూడా బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోందిజ. ఇవి రెండూ ఎఐసిసి హామీమేరకు ప్రతిపాదించగా, ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుండి బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి , మక్తల్ నుండి వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు సీఎం మద్దతుతో లైన్ క్లియర్ కాగా, పార్టీ కోర్ కమిటీ కూడా ఈ ఇరువురిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఆశావహులు చాలా మండి ఉండడంతో.. పదవులపై ఉత్కంఠ నెలకొన్నా, రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన చర్చల్లోనే పేర్లు ఫైనల్ అయ్యాయని మళ్ళీ మార్పులేవీ ఉండవని ఆదివారం టాక్. అయితే హైకమాండ్ నుండి జాబితా వచ్చేవరకు, చివరిక్షణం దాకా మంత్రివర్గ ఆశావహులు ప్రయత్నాలు చేసే అవకాశం కనబడుతోంది.
విధేయత..సమర్ధత
రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. భువనగిరి ఎంపీ ఎన్నికల సమయంలో తనకు మంత్రికావాలన్న కోరిక ఉందని, తాను ఎంత కష్టమైనా ఒంటిచేత్తో గెలిపిస్తామని.. తాను మంత్రిని అయ్యేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి వద్ద షరతు పెట్టారు. రాజగోపాల్ రెడ్డి మాట నెరవేర్చుకోగా, ఇపుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట నిలుపుకునేదిశగా రంగం సిద్దం చేశారన్న చర్చ ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రులుగా ఎవరూ లేరు. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆది నుండీ సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. ఆయన బెర్త్ కోసం సీఎం పట్టుబట్టి సాధించినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఫిక్స్ అయింది. లోక్ సభ ఎన్నికల సమయంలోనే సీఎం దీనిని ప్రకటించగా, తాజాగా ఉత్తమ్, భట్టి, పీసీసీ చీఫ్ అందరూ ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఎఐసిసి ఇప్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుని చర్చించినట్లు తెలుస్తోంది.








