Mahaa Daily Exclusive

  బెట్టింగ్ యాప్స్‌ వ్యవహారంపై సిట్ ఏర్పాటు 90 రోజుల్లో నివేదిక అందించాలి ఆదేశాలు జారీ చేసిన డీజీపీ జితేందర్‌…!

Share

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు చేపట్టనుంది. సిట్‌ బృందంలో ఐజీ రమేశ్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్‌, డీఎస్పీ శంకర్‌ ఉన్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంపై ఇప్పటికే పంజాగుట్టతో పాటు సైబరాబాద్‌, మియాపూర్‌ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కూడా ప్రభుత్వం సిట్‌కు బదిలీ చేసింది. దీనిపై 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని సిట్‌కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్వ్యూలు, సరదా వీడియోలతో సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. వీరి కంటెంట్‌ నచ్చి ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది బెట్టింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లకు ప్రచారం చేయడం సమస్యగా మారుతోంది. వీరిని ఫాలో అవుతున్న సామాన్య ప్రజలు బెట్టింగ్స్ పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు

తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ బెట్టింగ్, గేమింగ్‌పై గతంలోనే నిషేధం విధించింది. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడినా ప్రోత్సహించినా శిక్షార్హులు అవుతారు. ఆన్‌లైన్, సోషల్ మీడియాలో బెట్టింగ్‌కు ప్రచారం కల్పించడం, వాటిని ప్రోత్సహించడం నిషేధం. ఈ నిబంధనలను ఉల్లంఘించి ప్రచారం చేస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం- 2019 కింద కేసులు నమోదు చేస్తారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్​లు ప్రమోట్ చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మియాపూర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌లో నమోదైన ఈ కేసులు ఇప్పడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. రాష్ట్రంలో నిషేదం ఉన్న ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూఎన్సర్లు కేసుల్లో నిందితులుగా ఉంటడమే ఇందుకు కారణం. అయితే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటున్నారు.