Mahaa Daily Exclusive

  ప్రధాని రేసులో లేను రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కానే కాదు ఎప్పటికీ యోగిగానే ఉండిపోతా యూపీ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..!

Share

రాజకీయాలు తనకు ఫుల్ టైం జాబ్ కానే కాదని, ఎప్పటికీ మనసారా యోగిగానే ఉండిపోతానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవి రేసులో తాను ఉంటానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను యోగి వెల్లడించారు. “యూపీ ప్రజలకు సేవ చేయడమే నా ప్రధాన కర్తవ్యం. నాకు పార్టీ అప్పగించిన బాధ్యత అదే. దాన్ని సరిగ్గా నిర్వర్తిస్తా” అని ఆయన పేర్కొన్నారు.

“ఇంకా ఎంతకాలం పాటు రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తున్నారు?” అని యోగిని ప్రశ్నించగా, “దానికి కూడా ఒక కాలపరిమితి ఉంటుంది” అని చెప్పారు. “రాజకీయాలతో మతాన్ని కలపడంపై మీ అభిప్రాయమేంటి?” అని యోగిని అడగగా, “మనం మతాన్ని ఒక స్థాయి వరకే పరిమితం చేస్తాం. రాజకీయాలను కొంత మందికే పరిమితం చేస్తాం. ఇందువల్లే సమస్య తలెత్తుతుంది. స్వార్థపూరిత రాజకీయాలతో సమస్యలు వస్తాయి. సువిశాల ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మాకు మతం చెప్పేది కూడా అదే” అని సీఎం యోగి పేర్కొన్నారు. “భారత ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం, మతంలో స్వార్థభావనకు తావు ఉండదు. ఆధ్యాత్మిక భావనను జనంలోకి తీసుకెళ్లేందుకు రాజకీయాలు కూడా ఒక వేదిక” అని ఆయన చెప్పారు.

మిమ్మల్ని మీరు మతపరమైన నేతగా భావిస్తున్నారా? రాజకీయ నేతగా అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా, “నేను భారత పౌరుడిని. ఇతరుల కంటే స్పెషలేం కాదు. రాజ్యాంగ విధులను నిర్వర్తించడం నా మొదటి కర్తవ్యం. నాకు అన్నింటి కంటే దేశమే ఎక్కువ. ఈ దేశం బాగుంటేనే నా మతం సురక్షితంగా ఉంటుంది. మతం సురక్షితంగా ఉంటేనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుంది” అని యూపీ సీఎం చెప్పారు. రాబోయే వందేళ్ల పాటు నిలిచే ప్రతిష్ఠను సంపాదించానని భావిస్తున్నారా? అని యోగిని ప్రశ్నించగా, ‘‘పేరు ముఖ్యం కాదు. మనం చేసిన పనులే ముఖ్యం. అవే మనకు గుర్తింపును సాధించి పెడతాయి” అని బదులిచ్చారు. రోడ్లు అనేవి ట్రాఫిక్ కోసం, వాటిపై నమాజ్ చేయొద్దని ముస్లింలకు సీఎం యోగి సూచించారు. హిందువులను చూసి మతపరమైన క్రమశిక్షణను అలవర్చుకోవాలని ముస్లింలకు హితవు పలికారు. వక్ఫ్ బోర్డులు భూముల కబ్జా గ్యాంగులుగా దశాబ్దాల తరబడి చలామణి అయ్యాయని ఆయన మండిపడ్డారు. అవి ముస్లింలకు చేసిందేమీ లేదన్నారు. వక్ఫ్ బిల్లును ప్రతిపక్షాలు విమర్శించడం, వ్యతిరేకించడం సరికాదన్నారు. “హిందూ ఆలయాలు, మఠాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ భూములున్నా వక్ఫ్ బోర్డులు ఏమీ చేయలేకపోయాయి. ముస్లిం సంక్షేమానికి అవి పాటుపడలేదు. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు ప్రయోజనం దక్కబోతోంది” అని యోగి తెలిపారు. “యూపీలో ముస్లింలు 20 శాతం మందే. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందే వారిలో 40 శాతం మంది ముస్లింలు ఉన్నారు” అని ఆయన వెల్లడించారు. “మేం మౌలిక వసతుల కల్పన కోసం బుల్డోజర్ వాడుతాం. ఆక్రమణల తొలగింపు కోసం బుల్డోజర్ వాడుతాం. దాన్ని సమర్ధంగా ఎలా వాడాలో మేం అందరికీ చూపించాం” అని యోగి తెలిపారు.