ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. హలో బీసీ ఛలో ఢిల్లీ అంటూ బీసీసంఘాలు ఢిల్లీలో మహా ధర్నాకు పిలుపునివ్వగా, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఆందోళనకు హాజరవుతున్నారు. ఉదయం 9.30కు రాహుల్ ఈ ధర్నాలో పాల్గొంటారు. బీసీ మహా ధర్నా నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన కీలక నేతలంతా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సహా ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చారిత్రాత్మక బిల్లు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం బంతిని కేంద్రప్రభుత్వ కోర్టులోకి నెట్టింది. కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా బుధవారం ఢిల్లీలో బీసీ సంఘాలు మహా ధర్నాకు పిలుపునివ్వగా, కాంగ్రెస్ ముఖ్యనేతలంతా సంఘీభావంగా రానున్నారు. పార్లమెంట్ లో చట్టం ద్వారానే ఉద్యోగాల్లో, రాజకీయ పదవుల్లో 42 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయని, కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రభుత్వం తరహాలో చట్టం చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేయనున్నాయి. రాహుల్ గాంధీ స్వయంగా ఆందోళనలో పాల్గొంటుండడంతో బీసీ ఉద్యమానికి మరింత ఊపు లభించినట్లయింది.








