Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్ విమానాశ్రయానికి లైన్​ క్లియర్…!

Share

ఆదిలాబాద్​ పౌరవిమానాశ్రయానికి వాయుసేన గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ మేరకు తమకు లేఖ అందిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్​కు ఎయిర్​పోర్టు కావాలన్న ఎన్నో ఏళ్ల కల నేరవేరిందని, ఈ సందర్భంగా జిల్లా​ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం మామునూర్​ ఎయిర్​పోర్టుకు అనుమతులు సాధించామని, ఇప్పుడు ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టుకు ఇండియన్ ఎయిర్​పోర్స్​ నుంచి అనుమతులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆరు నెలల వ్యవధిలోనే రెండు ఎయిర్​పోర్టులకు అనుమతులు సాధించడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్​ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు భారత వాయుసేన అధికారులు సముఖత వ్యక్తం చేయడంతో పాటు అక్కడ భవిష్యత్తులో వాయుసేన శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు లేఖలో తెలిపారని మంత్రి తెలిపారు.

పౌర విమాన సేవలు ప్రారంభించేలా సేవలు

ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతులు సాధిస్తామని, ఖచ్చితంగా ఏర్పాటుచేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల తిరక్కుండానే అనుమతులు సాధించి దమ్ము చూపారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ పై తెలంగాణ ప్రభుత్వానికి పౌర విమాన సేవలను ప్రారంభించేందుకు కావాల్సిన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వాయుసేన అధికారులు లేఖ ద్వారా తెలిపారని మంత్రి వెంకటరెడ్డి వివరించారు. ఈ విమానాశ్రయాన్ని పౌర విమానయానానికి, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్​గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్లు మంత్రి తెలిపారు. పౌర విమానాల రాకపోకలకు అనువుగా రన్‌వే పునర్నిర్మాణం చేయడంతో పాటు, పౌర టర్మినల్ ఏర్పాటు, ఎయిర్​క్రాఫ్ట్ ఎప్రాన్​ వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి పనులు చేయాల్సి ఉందన్నారు. ఇందుకు అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు సమకూర్చుకోవాలని వాయుసేన అధికారులు లేఖలో సూచించినట్లు మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఎయిర్ పోర్ట్​కు అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిటెయిల్డ్ ప్రపోజల్స్​ను భారత వాయుసేనకు సమర్పించాలని కోరినందున అందుకు సంబంధించిన తదుపరి కార్యాచరణను అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు.

త్వరలోనే కేంద్రానికి నివేదిక

అతిత్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను రూపొందించి కేంద్రానికి, సంబంధిత విభాగాలకు సమర్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఇటీవల మామునూర్, ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులకు అనుమతుల మంజూరీలో సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి, రాష్ట్రంలో ఎయిర్ పోర్ట్​ల ఏర్పాటుకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.