ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ వార్తల్లో నిత్యం నిలిచే బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావును బీజేపీ ఎంపిక చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ నిర్ణయంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మేకప్ మెన్‌లు, టేబుల్ తుడిచే వాళ్లకు టికెట్లు ఇస్తున్నారు. పార్టీకి నిజమైన పని చేసిన వారిని విస్మరిస్తున్నారు. పార్టీకి మగాళ్లు దొరకలేదా?” అని పరోక్షంగా గౌతం రావును ఉద్దేశిస్తూ రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో మాధవిలతను హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడూ రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినీ ఉద్దేశించి పరోక్షంగా రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎంత ముఖ్య నాయకుడైతే మాత్రం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వారికే అవకాశం ఇస్తారా..? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిగతా పార్లమెంట్ల పరిధిలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇంకెవరూ కంటికి కనిపించలేదా అని ఫైర్ అయ్యారు. మీకు గులాంగిరీ చేసేటోళ్లకే పోస్టులు, టెకెట్లను పంచిపెడతారా అంటూ రాజాసింగ్ తీవ్రం అసహనం వ్యక్తం చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలతో బీజేపీలో నాయకుల మధ్య విభేదాలు మరింత పెరిగే అవకాశమునట్లు పార్టీ గుసగుసలాడుతోంది. ఈ ప్రభావం రానున్న ఎన్నికలపైనా పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.








