ట్రంప్ చర్యలతో ఈ ఏడాదిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఇంతకుముందు 40 శాతం ఉన్న ఈ అవకాశం ఇప్పుడు 60శాతానికి పెరిగినట్లు పేర్కొంది. అంతేకాకుండా దేశ స్థూల దేశీయోత్పత్తి పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రపంచ దేశాలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలే దీనికి ప్రధాన కారణమని జేపీ మోర్గాన్ సీఈవో మైఖేల్ ఫెరోలి పేర్కొన్నారు. మాంద్యం వల్ల అమెరికాలో నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరుగుతుందని.. దీనివల్ల అగ్రరాజ్యంలో ఉద్యోగాలుండవని పేర్కొన్నారు. ప్రపంచదేశాల నుంచి యూఎస్‌కు వచ్చే దిగుమతులు 20శాతం కంటే ఎక్కువగా తగ్గే అవకాశం ఉందని యూఎస్ ఆర్థికవేత్త జోనాథన్ పింగిల్ పేర్కొన్నారు. రాబోయే త్రైమాసికాలలో జీడీపీలో దిగుమతులు 1986కు ముందు స్థాయిలకు తిరిగి వెళ్లే అవకాశం ఉందన్నారు. అమెరికా నూతన సుంకాల విధానంపై ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ సైతం ఆందోళన వ్యక్తంచేశారు. ట్రంప్ యంత్రాంగం అమలుచేస్తున్న సుంకాలు దేశానికి గతంలో ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయన్నారు. బార్క్లేస్, బోఫా గ్లోబల్ రీసెర్చ్, డ్యూష్ బ్యాంక్, యూబీఎస్ గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర పరిశోధనా సంస్థలు సైతం అమెరికా విధిస్తున్న కొత్త టారిఫ్‌లు అమెరికా ఆర్థికవ్యవస్థను పతనం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా అన్ని ప్రపంచదేశాలపై సుంకాలతో విరుచుకుపడ్డారు. తమతో వాణిజ్య లావాదేవీలు ఉన్న దేశాలన్నింటిపైనా ఆయన టారిఫ్‌లు వేశారు. భారత్- 27శాతం, వియత్నాం- 46 శాతం, ఇజ్రాయెల్- 17 శాతం సుంకాలు విధించారు. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని.. అయితే కనీసం 10% సుంకం చెల్లించాలని ఆయన స్పష్టంచేశారు. మొత్తం 27 శాతం టారిఫ్‌లో 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి రానుండగా.. మిగతా 17 శాతం ఏప్రిల్ 10 నుంచి విధించనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రకటన తో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి.








