Mahaa Daily Exclusive

  కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనిర్శిటీ ముఖ్యమంత్రి రేవంత్ వరం..!

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు సీఎం ప్రకటించగా, వెంటనే ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్ని సహజ వనరులు మెరుగైన అవకాశాలు ఉన్న మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరగా, మంత్రి తుమ్మల విజ్ఞప్తికి సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో యూనివర్సిటీని మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ని కొత్తగూడెం జిల్లాలో మంజూరు చేయడం ఉమ్మడి జిల్లాకు లభించిన గొప్ప గౌరవంగా చెప్పవచ్చు.

300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం
సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోనుంది. అత్యున్నత ప్రమాణాలతో వేలాదిమందికి విద్య ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుంది. మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చడం ద్వారా వేలాదిమంది యువ శాస్త్రవేత్తల ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేయనున్నారు. నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల అమలుతో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది.

భద్రాద్రికి మహర్దశ…యువతకు ఉద్యోగం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టనుంది. మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ గా మార్చి మంజూరు చేయడంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించునున్నాయి. వేలాదిమంది విద్యార్థులు ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతో పాటు శాస్త్రవేత్తలుగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రవేశాలు కల్పించే అరుదైన అవకాశం లభించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నలుమూలల నుంచి విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధి అవకాశాలు లభించాయి.

ప్రత్యేక వనరులు… జాతీయ స్థాయిలో ఖ్యాతి

భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విద్యాలయానికి జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ఇక్కడ బొగ్గుతోపాటు అన్ని ఖనిజాలు ( సహజ వనరుల) ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఖనిజనిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూల వసతులు ఉన్నాయి. నేషనల్ హైవే కి సమీపంలో 300 ఎకరాల్లో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయానికి సమీపంలో మినీ స్టిల్ ప్లాంట్, నావా లిమిటెడ్ , ఫెరో ఎల్లాయి,ఫెర్రో మెగ్నీషియం, విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లు కూడా మరో 300 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఐటీసీ పేపర్ బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నాయి. ఈ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ కల నెరవేరనుంది. రోడ్డు మరియు రైలు రవాణా మార్గాలు ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నాయి. 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఉండవు. అన్ని అవకాశాలు ఉన్న దృష్ట్యా ఇక్కడ ఎర్త్ సైన్సెస్ విద్యాలయం ఏర్పాటుకు అనుకూల అంశాలుగా ప్రభుత్వం గుర్తించింది.