గడచిన 10 సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. రెండు పర్యాయాలు గెలిచిన ప్రస్తుత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఎన్ని నిధులు రాష్ట్రానికి సాధించారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. గాంధీ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు మాత్రం సున్నా అని విమర్శించారు. రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి నిధులు తేవడంతో ఘోరంగా వైఫల్యం చెందారన్నారు.
దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో తొమ్మిదో స్థానానికి పడిపోయిందని, మెట్రోకు నిధులు అడిగితే ఇవ్వడం లేదని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవానికి నిధులు అడిగితే రూపాయి ఇవ్వలేదని, పైగా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ప్రబుత్వంపై రెచ్చగొడుతున్నారని విరుచుకుపడ్డారు. విభజన చట్టంలోని హామీల గురించి కేంద్ర మంత్రులు ఏనాడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. మతం పేరుతో రెచ్చగొట్టి ఓటచ్లను దండుకోవాలన్నదే బీజేపీ ప్రయత్నం తప్పా ప్రజల గురించి కానీ, వారి అవసరాల గురించి కానీ ఆలోచించని పార్టీ అని దుయ్యబట్టారు. మతతత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఆమోదించేందుకు కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదన్నారు. గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం లేదా? తెలంగాణ ప్రాజెక్టుల గురించి భాజపా నేతలు ఒక్కసారి కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానిది సవతితల్లి ప్రేమ అని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎప్పుడూ రహస్య బంధం ఉంటుందన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ వేల ఎకరాలు అమ్ముకుందంటూ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని బీజేపీ నేతలను ప్రశ్నించారు. గత ప్రభుత్వం లక్ష ఎకరాలు డీఫారెస్ట్ చేస్తే ఎందుకు ప్రశ్నించలేదుని నిలదీశారు.
అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుకత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, ఇవన్నీ ప్రజల్లోకి చర్చకు వెళితే రాష్ట్రంలో తమకు ఏ మాత్రం చోటు ఉండదన్న ఉద్దేశ్యంతో బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న బియ్యంపై బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. నిజంగా సన్నబియ్యం మొత్తం కేంద్రమే ఇస్తే ఎందుకు దేశ వ్యాప్తంగా అమలు చేయడం లేదన్నారు. గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్లను ఇస్తున్న బీజేపీ తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లను ఒప్పుకోమని మాట్లాడటం దారుణమన్నారు. ప్రజలను విడదీసి రాజకీయంగా లబ్ధిపొందాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఏ మాత్రం సహించరన్నారు.








