Mahaa Daily Exclusive

  ‘కట్టిన ఇల్లు,పెట్టిన పొయ్యి’ ఏమాయే ‘సారూ’ !

Share

‘కట్టిన ఇల్లు,పెట్టిన పొయ్యి’ అని బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే మాట్లాడుతున్నారు.అంటే తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దామని,అన్ని సమస్యలు పరిష్కరించేశామన్నది ఆ మాట తాత్పర్యం. తాము అలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని అప్పజెప్పగా దాన్ని రేవంత్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నట్టు తండ్రీ,కొడుకు,మేనల్లుడూ ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవం వేరు. కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతినెలా 6,500 కోట్లు వడ్డీ కట్టవలసి రావడం కన్నా దుర్భర పరిస్థితులు ఏముంటాయి?ఈ అప్పుల గురించి,వడ్డీల గురించి,అస్తవ్యస్తంగా మారిన ఆర్ధిక వ్యవస్థ గురించి బిఆర్ఎస్ నాయకులు మాట్లాడరు.తాము ఆ అప్పులతో సంపద సృష్టించినట్టు దబాయింపు.

”కొత్తగా నడిపించేది ఏం లేదు. మొద్దులు మోసేది లేదు.కట్టెలు కొట్టేది లేదు.కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వేదిలేదు. ఉన్నది ఉన్నట్టు నడిపించలేని అసమర్థత ఏంది? అశక్తత ఏంది? కట్టిన ఇల్లు,పెట్టిన పొయ్యి కదా.దానిని నడిపించే తెలివిలేకపోతే ఎట్లా”? అని కేసీఆర్ 2024 ఏప్రిల్ లో అన్నారు.మాటల గారడీకి ఆయన పర్యాయపదం అనే సంగతి చెప్పవలసిన పనేం లేదు. అందుకే తెలివిగా ‘కట్టిన ఇల్లు,పెట్టిన పొయ్యి’ ని సమర్ధంగా నడపలేకపోతున్నట్టుగా రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు.

రాజకీయంగా నానాటికి బలపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బలహీనపరచడమెలా?అనే అంశంపై బిఆర్ఎస్ అన్ని కోణాల్లో ‘పరిశోధన’ జరుపుతోంది.రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడమే ఇందుకు సరయిన మార్గంగా ఆ పార్టీ నిర్ధారణకు వచ్చినట్టు తెలియవచ్చింది.ఇందులో భాగంగానే ‘వివాదాస్పదం కాని’, ప్రభుత్వ భూములు అయిన కంచ గచ్చిబౌలి భూములను
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములుగా ప్రచారం చేసింది. ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించుకునే హక్కు,అధికారం ప్రభుత్వానికి ఉన్నాయి.ఈ భూములను వేలం వేస్తామని,మౌలిక సదుపాయాల కల్పనకు,పరిశ్రమల స్థాపనకు,ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ఈ భూముల గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించడం ఆయన ‘భోళా తనానికి ‘ నిదర్శనం.ఆ క్షణమే ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్ లో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారని తెలియవచ్చింది.
‘తెలంగాణలో అస్థిర పరిస్థితులున్నాయి.శాంతి భద్రతలు లేవు.పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలంగా లేవు’ అని ప్రజల్లో,పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులు,వ్యాపారవర్గాల్లో ఒక సందేశాన్ని బలంగా తీసుకువెళ్లడం ఆ యాక్షన్ ప్లాను సారాంశంగా అనుమానాలు వ్యక్తమవుతున్నవి.యాక్షన్ ప్లాను అమలుకు గాను తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లన్నింటినీ అప్రమత్తం చేశారు.వాటిలో పనిచేస్తున్న ‘సుపారీ’ వ్యక్తులందరినీ సిద్ధం చేశారు.తమ చతురంగ బలగాలను మోహరింపజేశారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు భయపడే రీతిలో ‘క్యాంపెయిన్’ జరుగుతోంది. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు తప్పనిసరి.పెట్టుబడులు వస్తే పరిశ్రమల స్థాపన జరుగుతుంది. పరిశ్రమలు వస్తే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూసేకరణకు అడుగడుగునా బిఆర్ఎస్ అడ్డుకుంటోంది.అలజడి సృష్టిస్తోంది.హైదరాబాద్ లో అశాంతి వాతావరణం ఉన్నట్టు వ్యాపార,పారిశ్రామిక వర్గాలు భావిస్తే ఇక పెట్టుబడులు పెట్టడానికి వారెలా ముందుకొస్తారు? ఈ విషయాన్ని కాచివడబోసిన కేసీఆర్,కేటీఆర్ ఒక పథకం ప్రకారమే పెట్టుబడులు రాకుండా ‘కృత్రిమ అశాంతి’ ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

సెంట్రల్ యూనివర్సిటీ,కంచె గచ్చిబౌలి భూముల సంగతి పక్కన బెడితే రెండు విషయాలు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి.
1. ప్రజల్లో వచ్చిన నిరసనల వలన నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు అనుమతులను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.హైదరాబాద్ – నాగపూర్ జాతీయరహదారిపై ఈ పరిశ్రమకు వ్యతిరేకంగా ఎంత పెద్దఎత్తున పోరాటం నడిచిందో చూసాం.ఈ ఆందోళనల వెనుక ఒక ‘రాజకీయ’కుట్ర ఉందని,కనీసం పది,ఇరవై మంది చనిపోయినా ఉద్యమాన్ని కొనసాగించాలన్న లక్ష్యంతో ఆ రాజకీయపార్టీ చేసిన ప్రయత్నాలను తాము భగ్నం చేసినట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి నాకు చెప్పారు. ఆర్డీవోపై దాడికి తెగబడిన సంఘటన కూడా జరిగింది. ఆ అధికారి ఇంకా చాలా విషయాలు చెప్పినా వాటిని రాయదలచుకోలేదు. పోలీసు కాల్పులు జరిపేదాకా ఆందోళనను విరమించకూడదని సామాన్య యువకులను ‘హిప్నటైజ్’చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

2. లగచర్లలో భూసేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభలకు హాజరయ్యేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా మరికొందరు ఉన్నతాధికారులను ‘హత్య’ చేయడానికి కుట్ర జరిగినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.జిల్లా కలెక్టర్,ఇతర రెవెన్యూ అధికారుల బృందం ఆ గ్రామానికి చేరగానే ‘మాటు వేసిన’ అసాంఘిక శక్తులు వారిని పక్కదోవపట్టించి, తర్వాత రాళ్లు,ఇతర మారణాయుధాలతో దాడులకు తెగబడడం,అప్పటికప్పుడు యాదృచ్చికంగా జరిగిన ఘటనలు కావని పోలీసులు ఇప్పటికీ చెబుతుంటారు.సరే,ఆ హింసాత్మక ఘటనల వెనుక ఒక ‘రాజకీయ పార్టీ’ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకించడంతో భాగంగా జరిగిన నిరసన కార్యక్రమాలు అయినా,లగచర్ల భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఘటనలు అయినా ఒక ప్రణాళికా బద్ధంగానే జరిగినట్టు సీనియర్ ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు.కాకతాళీయంగా ప్రజాగ్రహంతో జరిగిన ఘటనలు కావని అంటున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి,కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబకడానికి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ తన సర్వ శక్తులూ ఒడ్డుతున్నట్టు పలు సన్నివేశాలు కనిపిస్తున్నవి.పైకి మాత్రం అవి ప్రజల ఆందోళన కార్యక్రమాలుగానో,విద్యార్థుల ఆందోళన లాగానో మనకు కనిపిస్తున్నప్పటికీ ఆయా ఆందోళన కార్యక్రమాలకు ‘తార్కిక ముగింపు’ ఎలా ఇవ్వాలి అనే అంశాన్ని కొందరు ‘సోకాల్డ్’ మేధావులు,బిఆర్ఎస్ ప్రాయోజిత మనుషులు ‘డిజైను’చేసి పార్టీ పెద్దల నుంచి ఆమోదం తీసుకొని కార్యక్షేత్రంలోకి వదులుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నవి.

రుణమాఫీ,ఆరు గ్యారంటీల అమలు,మూసీ,ఫోర్త్‌ సిటీ,ఆర్‌ఆర్‌ఆర్‌,మెట్రో విస్తరణ,గురుకులాల్లో సమీకృత భవనాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదప్రజలందరికీ ‘సన్నబియ్యం’ పంపిణీ పథకం రేవంత్ ఖాతాలో చేరాయి.రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 55 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ చేయడం ఒక సంచలనం. దేశంలోనే మొదటి సారిగా ‘ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ’ ని కొత్తగూడెంలో ఏర్పాటు చేయడం రేవంత్ ఖ్యాతిని పెంచింది.కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అతలాకుతలంగా,అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం కష్టతరంగా ఉన్నది.

తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉందా? బిఆర్ఎస్ ఉందా? అనే అనుమానాలు వచ్చే విధంగా కేసీఆర్,కేటీఆర్ మీడియా కథానాలు వండి వార్చుతోంది.కేసీఆర్ ఫార్మ్ హౌజ్ నుంచి పరిపాలించాలనుకున్నా ప్రజలకు అభ్యంతరం లేదనే విధమైన సమర్ధన సాగుతోంది. ”ఇక తెలంగాణ తరహా మరో ఉద్యమానికి కార్యాచరణకు కేసీఆర్ పదునుపెడుతున్నారు”! అని కేటీఆర్ సోషల్ మీడియా చెబుతోంది.

తెలంగాణ రాష్ట్ర సాకార ఉద్యమం వెనుక 6 దశాబ్దాలకు పైగా ప్రజల్లో ఒక సెంటిమెంటు ఉన్నది.భావోద్వేగాలున్నవి. ఆ ఎమోషన్స్ తో సకల వర్గాలు కనెక్టు అయ్యారు. అది గడచిన కాలం.ఇప్పుడు మళ్ళీ తెలంగాణ తరహా ఉద్యమానికి ప్రాతిపదిక ఏమిటి? ‘కేసీఆర్ పాలన రావడం కోసమేనా’? కేసీఆర్ పాలన ఎవరు కోరుకుంటున్నారు? భూస్వాములు,సంపన్నులు,కమ్మ,వెలమ సామాజిక వర్గాలు,పదేండ్ల పాటు ప్రకృతి వనరులను కొల్లగొట్టిన వారు,ఏదో ఒక పథకం రూపంలో ప్రయోజనం పొందిన వర్గాలు, కాంక్షిస్తున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నవి. హైదరాబాద్ నగరాన్ని,దాని చుట్టు పక్కల ప్రాంతాలను ‘కబళించిన’ వర్గాలకు,వ్యక్తులకు,మరీ ముఖ్యంగా కోస్తాఆంధ్ర నుంచి వలస వచ్చి స్థిరపడి ‘ఆనకొండ’లా చుట్టు ముట్టిన వారికి కేసీఆర్ అంటే ప్రేమ! కేటీఆర్ అంటే మమకారం! తండ్రీ కొడుకులు పదేండ్లు రియల్ ఎస్టేట్,సినీ పరిశ్రమ,సంపన్న సెక్షన్లతో ఎట్లా చెట్టా పట్టాలు వేసుకొని ఆ వర్గాల పాలిట ‘అక్షయ పాత్ర’ గా మారారో చూసాం.బహుశా మరో తెలంగాణ ఉద్యమానికి ఆయా వర్గాలే ఇంధనం సమకూర్చవచ్చు! ఇలాంటి నకిలీ,మకిలి ఉద్యమాలకు ప్రజల మద్దతు ఉండదని కేసీఆర్ గ్రహించలేకపోతున్నారు.

రెండు మూడు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడం ద్వారా బ్రెయిన్ వాష్ చేయాలని మైండ్ గేమ్ ఆడడానికి బిఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించుకున్నట్టు సులభంగా అర్ధం చేసుకోవచ్చు.1:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో విఫలమయ్యారు. 2.కేసీఆర్ మరలా అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్ర పరిస్థితి గాడిలో పడదు.ఈ రెండు విషయాలను ప్రజల మనస్సులో బలంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకురావడానికి బిఆర్ఎస్ నాయకత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది.ప్రజల్లో ప్రభుత్వం పట్ల ‘కృత్రిమ వ్యతిరేకత’ను సృష్టించలేరు. ఎన్ని గజకర్ణ,గోకర్ణ,టక్కు టమార విద్యల్లో ఆరితేరిన కేసీఆర్ అయినా ఈ ప్రయోగంలో విఫలం కావడం తథ్యమని కాంగ్రెస్ నాయకులంటున్నారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజలు ‘స్వర్ణయుగం’ చూశారని,ఇప్పుడు నరకం చూస్తున్నట్టుగా బిఆర్ఎస్ నాయకుల ప్రచారం చేస్తున్నారు. దశాబ్దాలుగా చీకటిలో మగ్గిన తెలంగాణకు కేసీఆర్ ముందుచూపుతోనే ‘కరెంటు వెలుగు’ వచ్చిందనీ చెబుతున్నారు.ఆర్ధికక్రమశిక్షణ పాటించకపోవడం,ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం,రాచరికపు పోకడలు,మూర్ఖపు చర్యలు రాష్ట్రాన్ని కేసీఆర్ హయాంలో అప్పుల ఊబిలో నెట్టివేశాయి.”కాళేశ్వరం వంటి ప్రాజెక్టు వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అని నేను ఆనాడే చెప్పాను. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు.తెలంగాణ ఆర్ధికంగా కుంగిపోవడానికి పాలకుల స్వయంకృతాపరాధం” ! అని లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ నుంచి ఎదురవుతున్న విమర్శల ‘విపత్తు’ తో సీఎం రేవంత్ నిరంతరం
పోరాడవలసి వస్తున్నది. బహుశా గతంలో ఏ ముఖ్యమంత్రికీ ఇలాంటి విపత్తు వచ్చి ఉండదు.

గత ముఖ్యమంత్రుల మాదిరిగానే తన మార్కు అభివృద్ధి కూడా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అభివృద్ధిలో సొంత ముద్ర ఉండాలని రేవంత్‌ ఆలోచనలలో భాగంగానే మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు,ఫోర్త్‌ సిటీ,రీజినల్‌ రింగ్‌ రోడ్డు వంటి మూడు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టారు.ఈ కార్యక్రమాలు హైదరాబాద్‌ నగరానికి కొత్త కళను తీసుకొస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.మూసీ ప్రాజెక్టుతో పర్యావరణ పరంగానే కాకుండా ఆర్థిక,ఉపాధి,ఉద్యోగాల పరంగా కొత్త అవకాశాలు తీసుకొచ్చేలా చేయాలన్న సంకల్పంతో రేవంత్ ఉన్నారు.ఫోర్త్‌ సిటీ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్ఠ్టాత్మక ప్రాజెక్టు.40 వేల ఎకరాల పరిధిలో అద్భుతమైన సరికొత్త నగరాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారు.ఇప్పటికే ఇక్కడ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని,జీనోమ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.స్కిల్‌ యూనివర్సిటీని రూ.200 కోట్లతో నిర్మించడానికి ‘మేఘా’ సంస్థ ముందుకు రావడమే కాకుండా నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేసింది.

ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలకు వేర్వేరుగా ఉన్న గురుకుల పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని రేవంత్‌ ప్రభుత్వం భావిస్తోంది.ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళను ఏర్పారు చేస్తున్నారు.‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌’ పేరిట ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున ప్రభుత్వం నిర్మించనుంది. ఆరు గ్యారంటీల్లో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం,రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు,వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు,బియ్యం సబ్సిడీ, ఉపకార వేతనాలు,డైట్‌ చార్జీల పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ తదితర పథకాలన్నీ అనేక వ్యయ ప్రయాసలకోర్చి అమలు చేస్తోంది.నిధుల సర్దుబాటు సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నా రుణమాఫీ పథకం కిందే రూ.20,616 కోట్లను రేవంత్ ప్రభుత్వం వెచ్చించింది.రైతు భరోసా దశలవారీగా అమలవుతోంది.

కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ దృష్టి సారించారు.నిరుద్యోగులను సంతృప్తి పరచడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో వెలువడిన కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలతోపాటు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లతో మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేసింది.చాలాకాలంగా పెండింగులో ఉన్న 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు,22 వేల మంది ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలను పూర్తి చేసింది.

ప్రభుత్వ పాలన సాఫీగా సాగకపోవడానికి ఒకటి ఆర్థికపరమైన సవాళ్లు అయితే,రెండవది ప్రధానప్రతిపక్షం బిఆర్ఎస్ నిరంతరం రేవంత్ రెడ్డిని డిఫెన్సులో పడవేసేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలు.ఈ నేపథ్యంలో రేవంత్ ముక్కుసూటిగా,దూకుడుగా వెళుతున్నందున కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.పథకాలు,కార్యక్రమాలను అమలు చేయడంలో భాగంగా కొన్ని ఆటంకాలు ఎదురవడం సహజం. కానీ,వాటిని ముందస్తు ప్రణాళిక ప్రకారం అమలు చేయాలి.చేసే పని మంచిదే అయినా దానికి ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా కూడగట్టడం అత్యంత ప్రధానం.హైడ్రా,మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం మొదట సంకటం ఏర్పడింది.నదీ గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని,ఏళ్ల తరబడి ఉంటున్న నిర్వాసితులను ముందుగా ఒప్పించకుండా,వారికి భరోసా కల్పించకుండా ముందుకు వెళ్లడం వల్ల నిర్వాసితులు,ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత ఎదురైంది.ఆ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం నేరుగా ప్రజల్లోకి వెళ్లింది.నల్లగొండ జిల్లాలో రైతులతో భారీఎత్తున పాదయాత్ర నిర్వహించింది.పర్యావరణవేత్తలు కూడా మూసీకి మద్దతు పలికారు. మరోవైపు హైడ్రా విషయంలోనూ ప్రభుత్వం సరిదిద్దుకుంది.సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడుతుండడం ప్రజాస్వామిక లక్షణం.’నా మాటే శాసనం’ అన్నది కేసీఆర్ హయాంలో జరిగిన పాలానాతీరు.

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పదవి చేబట్టడం ఒక ముఖ్యమైన మైలురాయి. నాయకత్వ సామర్ధ్యాన్ని,అలాంటి నాయకత్వ ప్రతిభకు ప్రజామోదం లభించింది.”రేవంత్ ఒక నిబద్ధత కలిగిన పోరాట యోధుడు.రెండు దశాబ్దాల క్రితం శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ కోసం మా ఆందోళనలో ఆయన యువకుడిగా చురుకుగా పాల్గొన్నట్లు నాకు గుర్తుంది” అని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అప్పట్లో కామెంటు చేశారు.కేసీఆర్ కంటే ఆయన మంచి ముఖ్యమంత్రి అవుతారని ప్రొఫెసర్ జి. హరగోపాల్ అప్పట్లో చెప్పారు.పీసీసీ అధ్యక్షునిగా ఒంటి చేత్తో పార్టీని,ప్రచార పర్వాన్ని నడపడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి భట్టి,ఉత్తమ్,శ్రీధర్ బాబు,కోమటి రెడ్డి వెంకటరెడ్డి,రాజగోపాలరెడ్డి,వివేక్,పొన్నం తదితరులంతా తమ వంతు కృషి చేశారు.కానీ సీఎం పదవి రేవంత్ కు వరించడమంటే ఆషామాషీ కాదు.

రేవంత్ రెడ్డి తలపెడుతున్న పలు కార్యక్రమాలు ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచడంతోపాటు రాష్ట్ర ప్రగతిని పరుగులు పట్టించేవే. 72కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరణ పనులు,హైదరాబాద్‌ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకువెళ్లనున్నాయి.’కంచ గచ్చిబౌలి’ భూములకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో జరిగిన వైఫల్యం,రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.సుప్రీంకోర్టు దాకా బిఆర్ఎస్ వెళ్లే అవకాశమున్నట్టు కానీ,పర్యావరణ పరిరక్షణ పేరిట విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి శాంతిభద్రతల సమస్యను సృష్టించే అవకాశాలున్నట్టు కానీ సీఎం రేవంత్ కానీ,ఆయన టీమ్ లోని సీనియర్ మంత్రులు కానీ ఎందుకు గ్రహించలేకపోయారన్నది మిస్టరీ.ఇదీ ఒకరకంగా రేవంత్ ప్రభుత్వానికి మంచిదే.ఇకపై ఏ కార్యక్రమం అమలుకు పూనుకున్నా,ముందుగా బిఆర్ఎస్ ఎటువంటి అడ్డంకులు సృష్టించే ఛాన్సు ఉందో అంచనా వేయవచ్చు.అలాగే మరింత అప్రమత్తంగా ఉండి ప్రత్యర్థుల ఎత్తుగడలను భగ్నం చేయవచ్చు.

ప్రభుత్వం అత్యద్భుతంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం ‘కంచ గచ్చిబౌలి’ గొడవల్లో ప్రచారానికి నోచుకోకుండా పోయింది.బిఆర్ఎస్ కోరుకుంటున్నదీ అదే.రేవంత్ కు ఎట్టి పరిస్థితిలో ప్రజల్లో సానుకూలత ఏర్పడకూడదన్నది కేసీఆర్ పార్టీ విధానం.లేని సమస్యను ఉన్నట్టుగా చిత్రీకరించడంలో,’ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలయింద’నో ప్రాపగాండా చేయడంలో ఆ పార్టీ దిట్ట.దీన్ని ప్రజల్లో ‘మౌత్ టాక్’ వచ్చేలా సోషల్ మీడియాలోని ‘భజన బ్యాచ్’ ఉధృతంగా చేయడానికి ఆర్ధిక వనరులను విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదని తెలియవచ్చింది.

 

 

ఎస్.కే.జకీర్,
సీనియర్ జర్నలిస్ట్.